టీవీ 9 రవి ప్రకాష్ పేరు తెలుగు మీడియాలో సుపరిచితమే. టీవీ9 ఛానెల్ తో తెలుగు మీడియాను కొత్త పుంతలు తొక్కించిన వెలిచేటి రవి ప్రకాష్ టీవీ9 నే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. అయితే, తెలుగు మీడియాలో ఓ వెలుగు వెలిగిన రవి ప్రకాష్ ఆ తర్వాత అనూహ్యంగా ఫోర్జరీ కేసుతో టీవీ9 నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆయనపై అలంద మీడియా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ తర్వాత రవి ప్రకాష్ సొంతగా ఆర్ టీవీ స్థాపించారు. అయితే, తాజాగా ఆయనపై హత్యాయత్నం కోసం రెక్కీ జరిగిందన్న ప్రచారం సంచలనం రేపుతోంది.
వారం రోజులుగా నలుగురు వ్యక్తులు రవి ప్రకాష్ ఇల్లు, ఆఫీస్ దగ్గర రెక్కీ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన శివారెడ్డితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు రవి ప్రకాషన్ కదలికలను నిశితంగా గమనిస్తున్నారని తెలుస్తోంది. రవి ప్రకాష్ ను హత్య చేసేందుకే ఈ రెక్కీ జరిగిందని పుకార్లు వస్తున్నాయి. రవి ప్రకాష్ ఇంటి దగ్గర, ఆఫీసు దగ్గర కాపు కాసిన ఆ నలుగురు….రవి ప్రకాష్ కారును తమ కారులో ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.
అయితే, రెక్కీ నిర్వహించారని అనుమానిస్తోన్న శివారెడ్డి అండ్ టీం వెనుక “MEGHA (meil)” కృష్ణారెడ్డి ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తనను చంపాలని చూసినా, బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రవి ప్రకాష్ ఈ రెక్కీ గురించి వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారంపై రవి ప్రకాష్, పోలీసుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.