ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం ఇంకా కక్ష సాధింపు చర్యలు ఆపినట్లు కనిపించడం లేదు. ఏబీవీపై రెండోసారి విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) కొట్టివేసినా సరే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆయనను టార్గెట్ చేయడం మాన లేదు. ఒకే అభియోగంపై 2 సార్లు ఎలా సస్పెండ్ చేస్తారని ఏపీ ప్రభుత్వంపై క్యాట్ అక్షింతలు వేసినా సరే జగన్ సర్కార్ తీరులో మార్పు రాలేదు.
ఈ క్రమంలోనే క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ సీఎస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యాట్ ఆదేశాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వం దాఖలు పిటిషన్ పై హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ విచారణ చేపగ్గడి….ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి తరఫున జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) డిప్యూటీ కార్యదర్శి జయరాం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏబీ సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంలో క్యాట్ పొరబడిందని అన్నారు. ఏబీ తరఫు న్యాయవాది వాదనలు కూడా విన్న హైకోర్టు సమ్మర్ వెకేషన్ బెంచ్ తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కాగా, ఈ నెల 31న ఏబీ వెంకటేశ్వర రావు రిటైర్ కాబోతోన్న సంగతి తెలిసిందే.