ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి కోర్టు ఎన్ని మార్లు చెప్పినా.. లైన్లో పడడం లేదు. దీంతో కోర్టుల నుంచి మొట్టికాయలు.. విమర్శలు.. షరా మామూలుగా మారిపోయాయి. దీంతో కోర్టు ఆగ్రహానికి మరోసారి గురైనప్రభుత్వం.. తాజాగా.. “తప్పయిపోయింది.. బుద్ధి వచ్చింది.. ఇకపై ఎప్పుడూ.. ఇలా చేయం..“ అంటూ.. స్కూల్ విద్యార్థి టీచర్ను వేడుకున్నట్టు చేతులు కట్టుకుని కోర్టు ముందు నిలబడింది. లెంపలు వేసుకోకపోవడం ఒక్కటే తక్కువ.
విషయంలోకి వెళ్తే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కొందరి సలహాలతో.. పంచాయతీ భవనా లకు.. ప్రభుత్వ కార్యాలయాలకు రూ. కోట్ల ను ఖర్చు పెట్టి వైసీపీ జెండా రంగులను వేసేశారు. అయితే.. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఇది చట్ట విరుద్ధమని.. ప్రజల సొమ్మును పార్టీ ప్రచారాలకు ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు. దీనిని సమర్ధించిన.. హైకోర్టు.. రంగులు మార్చాలని సూచించింది. అయితే.. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..ఈ విషయంలో కొందరు పెద్దల ఒత్తిళ్లకు లొంగి.. ఒక రంగును మార్చేసి. పూర్తిగా మార్చినట్టు కోర్టుకు విన్నవించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. కోర్టు ఏకంగా.. ఆమెను కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇక, ఆ తర్వాత ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లడం.. అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. తీర్పు రావ డంతో విధిలేని పరిస్థితిలో మరో 4 వేల కోట్లు వెచ్చించి.. రంగులు మార్చారు. అంటే.. ప్రభుత్వం తరఫున చేసే ఏ కార్యక్రమానికైనా.. పార్టీ హంగులు రంగులు వద్దనే విషయం అందరికీ స్పష్టమైంది. అయితే.. వైసీపీ సర్కారుకు ఇలా అర్ధమై ఉంటే.. ఇప్పుడు మరోసారి.. కోర్టు ముందు చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు. ఇటీవల సీఎం జగన్.. రాష్ట్రంలో స్వచ్ఛ కార్యక్రమం క్లీన్ ఏపీని ప్రారంభించారు. ఈ సందర్భంగా 4 వేల పైచిలుకు చెత్త సేకరణ వాహనాలకు ఆయన పచ్చజెండా ఊపారు.
అయితే.. ఈ వాహనాలకు కూడా వైసీపీ జెండా రంగులనే వేశారు. దీంతో జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ వాహనాలకు పార్టీ రంగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తాజాగా హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వాహనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా పార్టీ రంగులు వేయమంటూ హైకోర్టుకు హామీ ఇచ్చింది. తమకు తెలిసి వచ్చిందని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి జి.కె.ద్వివేది అఫిడవిట్లో చేతులు కట్టుకున్నారు. అయితే.. పార్టీ రంగులు తొలగించిన తర్వాత.. మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడం గమనార్హం.