మేలు చేసిన వారి పట్ల భక్తి భావం తప్పేం కాదు. తనకు సాయం చేసిన వారిని పొగడ్తలతో ముంచెత్తటాన్ని తప్పు పట్టలేరు. కానీ.. అందుకు పరిమితులు.. పరిధులు ఉంటాయి. సామాన్యులు అల్పసంతోషులు కనుక.. అవగాహన లోపంతో అతిశయపు మాటల్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకు భిన్నంగా కోట్లాది మంది ఎంతగానో నమ్మే శ్రీవారికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తూ.. స్వామివారి సేవలో ఉండే పెద్ద మనిషి నోటి నుంచి వచ్చే మాటకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. అలాంటి వారికి ఎంత మేలు జరిగితే మాత్రం.. ఏకంగా స్వామి వారితో పోల్చే సాహసం సాధారణంగా చేయరు.
కానీ.. శ్రీవారి ప్రధాన ఆర్చకుడిగా తిరిగి ఎంపికైన రమణదీక్షితులు మాత్రం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సాక్ష్యాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమని పేర్కొన్న వైనం సంచలనంగానే కాదు.. పలువురిని విస్మయానికి గురి చేసింది. తనకెంత మేలు చేస్తే మాత్రం.. స్వామి వారిని ఒక వ్యక్తితో పోల్చటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.
ఇదే ప్రశ్నను సంధించిన ఆంధ్రజ్యోతి మీడియా అధినేత ఆర్కే.. తాజాగా తన కాలమ్ లో రమణదీక్షితుల్ని చెడుగుడు ఆడేశారు. ఈ సందర్భంగా శంకరాభరణం సినిమాలోని డైలాగుతో మొదలెట్టి.. మధ్యలో ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రమణదీక్షితుల ఎపిసోడ్ గురించి పెద్దగా ఫాలో కాని వారు సైతం.. అదేంటి? ఆ పెద్ద మనిషి అంత మాట అనేశాడా? అన్న భావన కలిగించేలా ఆర్కే మాటలు ఉండటం గమనార్హం. ఇంతకూ ఆయన ఏమన్నారు? ఆయన మాటల్లోనే చూస్తే…
-పూజారికి నత్తి, వేశ్యకు భక్తి ఉండకూడదని ‘శంకరాభరణం’ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తూ విష్ణుమూర్తి ప్రతిరూపమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడిగా పునఃనియమితులైన రమణదీక్షితులు స్తుతించిన నేపథ్యంలో ఈ డైలాగ్‌ను పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
నాశనమవుతున్న హిందూ సనాతన ధర్మాన్ని కాపాడ్డానికి జగన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారని కూడా దీక్షితులు శ్లాఘించారు. ఆయన హిందూ ధర్మాన్ని కాపాడతారా? లేదా? అన్నది పక్కనపెడితే హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి రమణదీక్షితులు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తున్నది.
కోట్లాది మంది భక్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా నమ్మి కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజిస్తూ స్తుతించాల్సిన ప్రధాన అర్చకుడి హోదాలో ఉన్న రమణదీక్షితులు, క్రైస్తవ మతాచారాన్ని ఆచరిస్తున్న జగన్ రెడ్డిని విష్ణుమూర్తి ప్రతిరూపమని అభివర్ణించడాన్ని మించిన అపచారం ఏముంటుంది? జగన్ రెడ్డిలో విష్ణుమూర్తిని చూస్తున్న రమణ దీక్షితులు ముఖ్యమంత్రి ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు ఎందుకు రాలేదో చెబుతారా?
తనకు వ్యక్తిగతంగా లాభం చేసినందుకు జగన్‌రెడ్డికి రుణపడి ఉండాల్సిన అవసరం రమణదీక్షితులుకు ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన ఒక నరుడిని నారాయణుడితో పోల్చడం ఏమిటి? క్రైస్తవ మతానికి చెందిన ఫాదర్లు గానీ, బిషప్పులు గానీ ఎవరైనా హిందువుని జీసస్ క్రీస్తు లేదా ఎహోవాగా అభివర్ణిస్తారా? అలా చేస్తే క్రైస్తవులు సహిస్తారా?
ఆది నుంచి రమణదీక్షితులుది వివాదాస్పద వ్యక్తిత్వమే. జగన్‌రెడ్డి విష్ణుమూర్తి ప్రతిరూపం అయితే తిరుమలలో ఉన్న శ్రీవెంకటేశ్వరుడు ఎవరు? అంటే ఇకపై తిరుమల కొండపై వెలసిన ఆ దేవదేవుడి విగ్రహంలో రమణదీక్షితులుకు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మాత్రమే కనిపిస్తారేమో! దేవుడిలో జగన్‌ను చూసుకునే వ్యక్తి ప్రధాన అర్చకుడిగా నియమితుడు కావడమే ఆ దేవదేవుడికి జరిగిన అపచారం.
రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల రమణదీక్షితులుకు మొదటి నుంచీ అభిమానం ఉంది. గతంలో ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుతూ కొండపైన యాగం చేశారు. గత ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం శ్రీవారికి చెందిన పింక్ డైమండ్‌ను ఎవరో దొంగిలించారని తీవ్ర ఆరోపణ చేశారు. పింక్ కలర్లో డైమండ్ అనేది ప్రపంచంలోనే ఇంతవరకు ఎక్కడా లేదని మైనింగ్రంగంలోని నిపుణులు చెబుతున్నారు.
భూగర్భంలోని కార్బన్ బాగా ఒత్తిడికి గురయితే నీలం రంగు డైమండ్ ఏర్పడుతుంది గానీ పింక్ కలర్లోకి రాదని విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన టిఎస్ఆర్ మూర్తి అనే విశ్రాంత మైనింగ్ ఇంజనీర్ ఫేస్బుక్ ద్వారా స్పష్టంచేశారు. అంటే, ఆనాడు రాజకీయ కుట్రలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై రమణ దీక్షితులు ఈ ఆరోపణ చేశారని భావించవచ్చు. దేవదేవుడికి మాత్రమే సేవలు, కైంకర్యాలు చేయవలసిన ప్రధాన అర్చకుడికి రాజకీయాలు అవసరమా?
చంద్రబాబుపై ఆయనకు కోపం ఉంటే ఉండవచ్చు. అంతమాత్రాన తనకు జీవనాధారం కల్పించిన దేవుడినే పావుగా వాడుకోవడం ఏమిటి? ఇంతటి పతనానికి దిగజారిన రమణ దీక్షితులు భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టే కదా? అందుకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. లేని పక్షంలో ఆ దేవుడే అందరి లెక్కలు సెటిల్ చేస్తాడు.
తన చర్యల ద్వారా రమణ దీక్షితులు ధర్మాన్ని కాపాడుతున్నారా? స్వార్థ చింతనతో పతనం అంచున నిలబడ్డారా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయాలను, రాజకీయపార్టీల నాయకులకు వదిలేసి చేతనైతే పాలకులకు మార్గ నిర్దేశం చేయడానికి ప్రయత్నించడం దీక్షితులు వంటివారికి మంచిది. జానెడు కడుపు నింపుకోవడానికి ఆ కడుపు నింపుతున్న దేవుడ్ని కూడా చిన్నబుచ్చడం దుర్మార్గం.