ఏపీలో కరోనా విలయతాండవం చేయడానికి సీఎం జగన్ అవలంబిస్తోన్న విధానాలే కారణమని వైసీపీ నేతలు సైతం విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని విపక్ష నేత చంద్రబాబు చెబితే ఆయనపై కేసులు నమోదు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కొత్త వేరియంట్ పై జగన్ ప్రజలను అప్రమత్తం చేయలేదని… ప్రజలను అప్రమత్తం చేయడమే చంద్రబాబు చేసిన నేరమా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ రెడ్డిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చీము, నెత్తురుంటే తక్షణమే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఓ నిరక్షరాస్యుడు సీఎంగా ఉన్నా ప్రజల ప్రాణాలు కాపాడేవారని విమర్శించారు. కరోనా కట్టడిలో విఫలమైన జగన్… కేసుల భయంతోనే ప్రధాని మోడీని పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసులు పెట్టాల్సింది చంద్రబాబుపై కాదని.. ప్రజల చావుకు కారణమవుతున్న జగన్‌పై అని అచ్చెన్న దుయ్యబట్టారు.
బాధ్యత గల ప్రతిపక్షంగా తాము ఇచ్చిన సలహాలు స్వీకరించకుండా తమపైనే విమర్శలు చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. కరోనా విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడం ముఖ్యమని, రాజకీయాలు కాదని అన్నారు. జగన్ సీఎం కాకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయి ఏంటని ఆయన ఎక్కడ ఉండేవారని ప్రశ్నించారు. కరోనా విజృంభిస్తుంటే పథకాలపై జగన్ దృష్టి పెడుతున్నారని విమర్శలు గుప్పించారు.
మరోవైపు, కడపలో బ్లాస్టింగ్ పై అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కరోనా ఉద్ధృతిలో మైనింగ్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ మాదిరిగానే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలన్నారు. వివిధ పరిశ్రమలు, గనుల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు తెలిపారు.