ఆళ్లగడ్డ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. తాజాగా ఆమె చేసిన సవాలే తాజా పరిస్థితికి కారణమని చెబుతున్నారు.
నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి చేసిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నట్లుగా అఖిలప్రియ చెప్పటం.. తన వద్ద ఆధారాల్ని నంద్యాల గాంధీ చౌక్ వద్ద బయటపెడతానని ప్రకటించారు.
అందుకు ముహుర్తంగా ఈ రోజు (ఫిబ్రవరి 4) నిర్ణయించారు.
ముందుగా వెల్లడించినట్లే.. ఈ రోజు ఆమె గాంధీ చౌక్ సెంటర్ కు బయలుదేరే ప్రయత్నం చేశారు. అయితే.. ఆమె అలా వెళ్లినపక్షంలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఆళ్లగడ్డ డీఎస్పీ సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో అఖిలప్రియ ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేశారు.
దీంతో.. పార్టీ నేతలు.. అఖిలప్రియ వర్గీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతిని బయటపెడతానని చెబితే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసుల తీరును తప్పు పడుతున్నారు భూమా అఖిలప్రియ వర్గీయులు. పోలీసుల తీరును తప్పు పడుతూ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.