న్యాచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ కెరీర్ ను పరుగులు పెటిస్తున్న సంగతి తెలిసిందే. దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నాని.. ఆ తర్వాత హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో సక్సెస్ జోరును కంటిన్యూ చేశాడు. తన మార్కెట్ ను భారీగా పెంచుకున్నాడు. నాని సినిమాలకు అటు థియేట్రికల్ బిజినెస్, ఇటు నాన్-థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయే లెవల్ లో జరుగుతుండటంతో.. నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయడం లేదు.
రూ. 100 కోట్ల రేంజ్ లో బడ్జెట్ పెట్టేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. దీంతో నాని రెమ్యునరేషన్ కొండెక్కి కూర్చుందట. వరుస హిట్స్, పెరిగిన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని నాని మళ్లీ తన రెమ్యునరేషన్ ను పెంచాడని ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాని చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో `హిట్ 3` ఒకటి. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు నానినే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.
అలాగే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఇటీవల నాని ఓ సినిమాను ప్రకటించారు. `నాని ఓదెల 2` దసరా రోజు ఈ చిత్రం ప్రారంభమైంది. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అయితే సరిపోదా శనివారం వరకు రూ. 25 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకున్న నాని.. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న చిత్రానికి ఏకంగా రూ. 35 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.