వైసీపీలో నెల్లూరు నేతల తిరుగుబాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడంతో ఏపీలో రాజకీయం రక్తి కట్టింది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ వారిద్దరూ తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ విచారణకు జగన్ ఆదేశించారు.
అయితే, ఆనం గెలిచిన వెంకటగిరి నియోజకర్గంలో ఆనంకు వ్యతిరేకంగా నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని వైసీపీ అధిష్టానం ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆనంపై నేదురమల్లి మండిపడ్డారు. వైసీపీ తరపున గెలిచిన తొలి ఏడాది నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనం వ్యవహరిస్తున్నారని నేదురమల్లి విమర్శించారు. ఆనం ఒక రాజ్యాంగ వ్యతిరేకశక్తిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడాదిన్నర నుంచి తన ఫోన్ ట్యాపింగ్ కు గురవుతోందని ఆనం ఇప్పుడు ఆరోపించడం ఏమిటని ఆయన నిలదీశారు. ఇంతకాలం ఈ వ్యవహారంపై ఆనం ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఆనం అని నేదురమల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనంకు వయసు పెరిగిందని, సొంత తమ్ముడే ఆయనను వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చాలా కాలం నుంచే టీడీపీతో ఆనం, కోటంరెడ్డి టచ్ లో ఉన్నారని ఆయన ఆరోపించారు. మరి, నేదురమల్లి ఆరోపణలకు ఆనం ఏ విధంగా కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.