తాజాగా సీఎం జగన్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయంపై పలు కోణాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. తప్పు చేసి.. సరిదిద్దుకుంటు న్నారా? లేక.. తమిళుల ఆగ్రహాన్ని పసిగట్టే.. జగన్ ఇలా చేశారా? అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. గతంలో జగన్.. స్థానిక ఎన్నికల విషయంలో అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో విభేదించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డకు కులాన్ని ఆపాదించడమే కాకుండా.. ఆయనను ఏకంగా పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని.. మూడేళ్లకు తగ్గిస్తూ.. ఆర్డినెన్స్ తెచ్చారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు జగన్. అయితే అప్పటికే పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అర్ధాంతరంగా తొలగిస్తూ జస్టిస్ కనగరాజ్‌ను నియమించడంపై పెద్ద వివాదం రేగింది. దీనిపై నిమ్మగడ్డ రమేశ్ న్యాయపోరాటం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం..నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేవలం నెల రోజుల్లోనే కనగరాజ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుర్చీని వదులుకోవాల్సి వచ్చింది.
పైగా ఆయన విజయవాడలో అద్దెకు ఉంటున్న ఇంటికి రెంట్ కూడా చెల్లించకపోవడం.. ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం.. వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇక, ఇదే విషయంపై తమిళనాడులో న్యాయవాదులు జగన్‌కు వ్యతిరేకంగా లేఖలు రాశారు. తమిళనాడులో మంచి పేరు సంపాయించుకున్న కనగరాజ్‌ను ఏపీకి తీసుకువెళ్లి అవమానిస్తారా? అంటూ.. వారు ప్రశ్నించారు. అయితే.. ఈ విషయంలో జోక్యం చేసుకున్న అప్పటి తమిళనాడు ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం స్టాలిన్ వారికి సర్ది చెప్పారు.
ఈ క్రమంలో ఏమనుకున్నారో.. ఏమో.. సీఎం జగన్.. గతంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారా? అన్నట్టుగా.. తాజాగా రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అథారిటీ ఛైర్మన్ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. జిల్లాస్థాయిలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. కనగరాజ్ నియామకం విషయంలో రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోలేదని.. గతంలో జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకే ఇలా చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం.