సికింద్రాబాద్‌లోని ఓ ఎలక్ట్రిక్ వాహన షోరూంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం వల్ల చెలరేగిన మంటలు ఆ షోరూంపై ఉన్న రూబీ లాడ్జికి పాకడంతో ఎనిమిది మంది మృతి చెందారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి కిందకు దూకిన కొందరికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురు చనిపోయారు. మంటల్లో చిక్కుకొని ఐదుగురు మరణించారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
పొగ దట్టంగా వ్యాపించడంతో లాడ్జిలోని పర్యాటకులు ఊపిరాడక అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు. సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయ సమీపంలో ఉన్న ఐదంతస్తుల భవనం లోని నాలుగో అంతస్తులో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో హోటల్ నిర్వహిస్తున్నారు. గ్రౌండ్‌ఫ్లోర్, సెల్లార్లో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం ఉంది. గ్రౌండ్‌ఫ్లోర్ లో జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ బైక్ లలోని బ్యాటరీలు పేలడం వల్లే మంటలు చెలరేగాయని కొందరు అంటున్నారు.
ఏది ఏమైనా గ్రౌండ్ ఫ్లోర్ లోని మంటలు పై అంతస్తులకు వేగంగా వ్యాపించడంతో వారికి తప్పించుకునే అవకాశం లేకపోయింది. క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని గాంధీ, యశోద ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రులు తలసాని, మహమూద్ అలి తదితరులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ అగ్నిప్రమాదంలో పలువురు చనిపోవడం బాధ కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందిస్తామన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు.