నేతల అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తుంటాయి. వారి కోసం కొత్త వాహనాల్ని.. కొత్త ప్రోత్సాహకాల్ని అందిస్తుంటాయి. ఇందుకు భిన్నంగా చాలా రోజుల తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టు జడ్జిల కోసం కొత్త వాహనాల ఆర్జీకి ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జిలకు కొత్త కార్లు కొనుగోలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
న్యాయమూర్తుల కోసం 20 కియా కార్లను కొనుగోలు చేయనున్నారు. న్యాయమూర్తుల వినియోగానికి కొత్త కియా కార్నివాల్ కార్లు కావాలని హైకోర్టు నిర్ణయించినట్లుగా ఏపీ ప్రభుత్వానికి రిజిస్ట్రార్ జనరల్ ఒక లేఖ రాశారు. దీనికి స్పందించి.. తగిన బడ్జెట్ ను విడుదల చేయాలని కోరారు.
మార్చి 24న లేఖ రాయగా.. రెండు రోజులకే స్పందించిన ప్రభుత్వం ఒక్కో కారుకు రూ.31.50 లక్షల చొప్పున మొత్తం రూ.6.3కోట్ల మొత్తాన్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సూచన చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. త్వరలో ఏపీ హైకోర్టు జడ్జిలకు కొత్త కియా కార్లు అందుబాటులోకి రానున్నాయి.