రోజు రోజుకు సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. తాజాగా అలాంటి అప్దేట్ ఒకటి బ్రిటన్ కు చెందిన ఫరాడైర్ అనే సంస్థ చెబుతోంది. ఈ కంపెనీ సరికొత్త బుల్లి విమానాన్ని సిద్ధం చేస్తోంది. ఫ్లైట్ ఫ్యూయల్ ఖర్చును తగ్గించటంతో పాటు.. ఈ రంగంలో సరికొత్త ఆవిష్కరణగా తమ హైబ్రిడ్ ట్రైప్లేన్ ను డెవలప్ చేస్తోంది. మరో తొమ్మిదేళ్లలో తాము రూపొందించిన సరికొత్త విమానం ద్వారా ప్రయాణికుల్ని స్వల్ప దూరాలకు వేగంగా తరలించేలా ప్లాన్ చేస్తోంది. అంతేకాదు.. సరకుల్ని సైతం డెలివరీ చేసేలా దీన్ని రూపొందిస్తున్నారు.
ఐదు టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ విమానం కేవలం పావుగంట వ్యవధిలోనే కార్గో విమానంగా మార్చుకునేలా దీన్ని రూపొందించారు. ఈ సరికొత్త విమానంలో ఇంధనంగా ఎలక్ట్రికల్.. బయో ఫ్యూయల్ ఇంధనాన్ని వాడనున్నారు. పర్యావరణ హితంగా విమానాన్నితయారు చేయటమే తమ లక్ష్యమని సంస్థ చెబుతోంది.
ఈ బుల్లి విమానం అందుబాటులోకి వస్తే.. తక్కువ ఖర్చుతో ప్రయాణించే వీలు ఉంటుంది. స్వల్ప దూరాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు. అయితే.. ఈ విమానంలో వినియోగించే ఎలక్ట్రిక్ బ్యాటరీలు సిద్ధమైనా.. పూర్తిగా బ్యాటరీతో నడిచేలా ఇంకా తయారు చేయలేదు. ఏమైనా.. రానున్న రోజుల్లో మరింత సాంకేతికత అందుబాటులోకి రానుందని చెప్పక తప్పదు.