అమరావతి రాజధాని భూముల్లో టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నాయకులు నానా యాగీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, వైసీపీ నేతలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అమరావతిలో ఇన్ సైర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ హైకోర్టు చెప్పినా టీడీపీ అధినేత చంద్రబాబును కేసుల్లో ఇరికించాలని జగన్ చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేయడం…ఆ తర్వాత చంద్రబాబుకు హైకోర్టు స్టే ఇవ్వడం జరిగిపోయాయి. జగన్ కు ఏ దిక్కూ లేక చివరకు 21 నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి అసైన్డ్ ల్యాండ్ అంటూ చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే అమరావతి అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ కేసంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదు వెనుక అసలు గుట్టు రట్టయింది.
ఎస్సీఎస్టీ కేసులో ఫిర్యాదుదారులైన కందా పావని, ఈపూరి సుబ్బమ్మ, అద్దేపల్లి సాంబశివరావు తదితరులు ఆ కేసు గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వారి స్టేట్ మెంట్లకు సంబంధించిన వీడియోలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టి వైసీపీ నేతల డ్రామాకు తెరదించారు.
అసైన్డ్ భూముల కేసులో జగన్ సర్కార్ కుట్రలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. రక్తకన్నీరు నాగభూషణాన్ని తలపించేలా ఆర్కే నటిస్తున్నారని, అసైన్డ్ భూముల విషయంలో ఆర్కే నటనకు ఆస్కార్‌ను మించిన అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, అద్దెపల్లి సాంబశివరావు తదితరులకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించిన వీడియోలను ధూళిపాళ్ల బయటపెట్టారు.
జగన్ బృందం తప్పుడు సాక్ష్యాలు సృష్టించిందని, అమరావతిలో రాజధాని ఇష్టం లేదని చెప్పే ధైర్యం లేని జగన్… తప్పుడు కేసులు పెట్టే స్థాయికి దిగజారారని అన్నారు. ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సీలు ఎవరు లేరని, బాధితులు కారని తెలిపారు. అమరావతిని తరలించేందుకు జగన్ కుట్ర పన్నారని, వైసీపీ నేతలు, పోలీసులే అందులో సూత్రధారులని చెప్పారు. తాడేపల్లి రాజమహాప్రసాదం విషప్రచారానికి వేదికైందని మండిపడ్డారు.
తాను ఓసీ అని అసలా కేసు తాము పెట్టలేదని, విచారణ పేరుతో భూమి అమ్మారా లేదా అని నిర్ధారించుకుంటున్నామంటూ కొందరు సంతకాలు పెట్టించుకున్నారని కందా పావని చెబుతున్నారు. ఆ సంతకం ఆధారంగా కేసు నమోదు చేశారని ఆ విషయం మీడియాలో వచ్చే వరకు తమకు తెలీదని అన్నారు. కేసు కోసం అంటే అసలు సంతకాలే పెట్టేవాళ్ళం కాదని వారు వాపోతున్నారు.
సీఐడీ వాళ్లు వచ్చి పొలం ఇచ్చారా అని అడిగితే అమ్మినట్టు చెప్పామని అద్దెపల్లి సాంబశివరావు అన్నారు. టీడీపీ పేరు, బలవంతంగా లాక్కురన్న మాట అసలు తమ దగ్గర ప్రస్తావనకు రాలేదన్నారు. బలవంతంగా లాక్కున్నారా అని సీఐడీ అధికారులు ప్రశ్నించారని, అదేమీ లేదని తాము చెప్పామని వెల్లడించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విషయం చెప్పామన్నారు.