రాజకీయ నాయకుల్లో దాదాపు 90 శాతం మంది ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారన్నది కాదనలేని నిజం. ఏదో 10 శాతం మంది నాయకులు మాత్రమే ఆడంబరాలకు దూరంగా ప్రజల్లో ఉంటూ నిరాడంబరమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
ఇక విలాసవంతంగా ఉండే నాయకులు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. తమపై విమర్శలు వచ్చినా.. అవేమీ పట్టించుకోకుండా తమకు నచ్చినట్లుగా జీవితాన్ని గడుపుతూనే ఉంటారు. అనుభవించు.. రాజా అనే విధంగా జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటారా?
తాజాగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఫోటో వైరల్‌గా మారింది. ఆయన విలాసవంతమైన జీవితం గురించి ఇప్పుడు చర్చ సాగుతోంది.
ఏపీ విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయన తరచుగానే విదేశాలకు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రష్యాకు వెళ్తున్న సమయంలో ఫేస్బుక్లో ఆయన పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
విలాసవంతమైన ప్రైవేట్ జెట్‌లో రష్యా వెళ్లిన ఆయన అందులో కూర్చుని ఉన్న ఫోటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. అంతే కాకుండా సాకులు వెతుక్కోకుండా జీవించండి హాయిగా పర్యటించండి అని ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. దీంతో ఆయన వ్యవహార శైలి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫోటో చూసిన ప్రతిపక్ష నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు. పర్యటనలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని కొంతమంది అంటే.. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా అధికార పార్టీ మంత్రులు ఇలా విలాసాలు చేస్తున్నారంటూ మరికొంత మంది తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే ప్రత్యర్థి పార్టీ నాయకుల మాటలతో మా నేతకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని వైసీపీ కార్యకర్తలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార మంత్రి హోదాలో ఉన్నా జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తర్వాతే ఎవరైనా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.
అధికార మంత్రులు ఏదైనా పర్యటనకు వెళ్తే ముందే తెలిసిపోతోంది. కానీ బాలినేని రష్యా పర్యటన విషయం ఆయన స్వయంగా ఫేస్బుక్లో పోస్టు చేసేంత వరకూ తెలీలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే ఇప్పుడీ పర్యటనకు వెళ్లాల్సిన అవసరం ఏముందనే చర్చ సాగుతోంది.
ప్రభుత్వ జీవోలను వెబ్సైట్లో పెట్టే విధానానికి జగన్ ప్రభుత్వం ముగింపు పలకడంతో అసలు ఈ మంత్రిది వ్యక్తిగత పర్యటనా? లేదా ప్రభుత్వ పర్యటనా? అనే విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. ఆయన పర్యటన గురించి వైసీపీ నేతలకే సమాచారం లేదని తెలుస్తోంది.