పార్టీ అధిష్టానానికి ఆయన నమ్మిన బంటు. ఆయనకు.. పార్టీ అధిష్టానమే సర్వస్వం. అయితే.. అధిష్టానం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. ఆ యువ ఎంపీని డమ్మీ చేసిందనే వాదన జోరుగా వినిపిస్తోంది. ఆయనే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ఈ యువ ఎంపీకి, వైసీపీ కీలక నాయకుడు, రాజానగరం ఎమ్మెల్యే, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాల మధ్య అంతర్గత పోరు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై అనేక సార్లు ఇరువురు నాయకులు కూడా రోడ్డెక్కి విమర్శలు చేసుకున్నారు.
దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని.. నువ్వు రాజమండ్రి వరకే పరిమితం కావాలని ఎంపీ భరత్‌ను ఆదేశించింది. దీంతో ఆయన కేవలం రాజమండ్రి సిటీ నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఈ నిర్ణయమే ఇప్పుడు ఆయనకు సెగ పుట్టిస్తోంది. రాజమండ్రి ఎంపీగా ఉన్న భరత్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లను గాలికొదిలేసి… ఎమ్మెల్యే అవతారమెత్తి రాజమండ్రి సిటీకే పరిమితమయ్యారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇక, జిల్లా అధ్యక్షుని హోదాలో ఉన్న జక్కంపూడి రాజా రాజమండ్రి సహా జిల్లా వ్యాప్తంగా హవా పెంచుకున్నారు. కానీ, ఆయన ఎమ్మెల్యే. మరోవైపు.. ఎంపీని పక్కన పెట్టి.. జిల్లా అధ్యక్ష హోదాలో ఉన్న రాజాకు పగ్గాలు ఇచ్చినా.. ఆయన పెద్దగా దూకుడు చూపించలేక పోతున్నారనే వాదన ఉంది. ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గ డైరెక్టర్ల పదవుల్లోనూ జక్కంపూడి అనుచరులను ఎంపీ తొలగించారు.
వీరిలో కీలకమైన నందెపు శ్రీనివాస్‌ను పదవి నుంచి తొలగించడంతో రాజాకు కూడా సెగ ప్రారంభమైంది. ప్రస్తుతం రాజమండ్రి సిటీలో ఎంపీ భరత్ మాటే చెల్లుబాటవుతోంది. అధికార యంత్రాంగంపైనా ఎంపీ భరత్ పైచేయి సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అయినా.. రాజా పైచేయి సాధిస్తారని అనుకుంటే.. ఆయన వెనుకబడిపోయారు. ఈ పరిణామాలు ఎలా ఉన్నా.. ఎంపీ స్థాయి వ్యక్తి.. కేవలం సిటీ కే పరిమితం కావడంతో ఆయనకు ఇబ్బందిగా మారింది. మరి భవిష్యత్తులో ఏం చేస్తారో చూడాలి.