విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఊపందుకుంటోంది. నిరంతరాయంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. బీజేపీ కూడా చివరకు ఊ అ అంటూ మద్దతు తెలిపితే… వైసీపీ నాయకులు మాత్రం చీమ కుట్టిన దొంగలా సైలెంట్ గా ఉన్నారు.
తాజాగా పవన్ , జనసేన పార్టీ విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంఘీభావ దీక్ష చేశారు. దీక్ష ముగిసిన అనంతరం పవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు జనసేన మద్దతు ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తుందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలని ఛలోక్తి విసిరి ప్రసంగం ప్రారంభించారు పవన్.
వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయం. వైసీపీ వంటి బుద్ధి జనసేనకు ఉండదు. స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీని ప్రశ్నిస్తేఏమైందని అడిగితే తమను పచ్చిబూతులు తిడతారా? ఇంట్లోవాళ్లను కూడా తిడతారా? అని పవన్ అడిగారు.
“విశాఖ ఉక్కు కేవలం ఓ చిన్న పరిశ్రమ కాదు, ఇది ఆంధ్రుల గౌరవం. తీవ్ర పోరాటంతో సాధించిన పరిశ్రమ. ప్రాణత్యాగాల ఫలితం. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో నేను మోదీతోనూ, బీజేపీతోనూ గొడవపెట్టుకోవాలని వైసీపీ నేతలు బాగా కోరుకుంటున్నారు.
వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి గనుక ఉంటే మీరెవరినీ తిట్టనక్కర్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేం అడ్డుకుంటాం అని ఓ ప్లకార్డును పట్టుకునే దమ్ము మీకుందా?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నాకు బీజేపీ అగ్రనేతలు ఎంతో గౌరవం ఇస్తారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని వారితో అంగీకారం కుదిరిన తర్వాతే నేను బీజేపీతో కలిశాను. ఆ మాటకు కట్టుబడే ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతే రాజధాని అని తిరుపతిలో చెప్పారు.
మాట మీద నిలబడడం మగతనం. వైసీపీ వాళ్లు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. ఎన్నికల ముందు అమరావతిని గొప్పగా కడతాం అన్నారు. ఒక్క ఎమ్మెల్యే గెలిచిన జనసేన పార్టీ ఢిల్లీకి వెళితే కేంద్రం పెద్దలు ఎంతో గౌరవం ఇస్తారు. మరి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్న వైసీపీ ఏంచేస్తోంది? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? రైైతులే కేంద్రాన్ని భయపెట్టినపుడు, అంత సంఖ్యలో ఎంపీలున్న వైసీపీ ఏం చేస్తోంది?
నాకు ప్రజాక్షేత్రంలో మాత్రమే బలముంది. కానీ చట్టసభల్లో నేను చాలా బలహీనుడిని. చట్టసభల్లో నాకు బలం ఉంటే నేనే ఢిల్లీ వెళ్లి మాట్లాడేవాడ్ని. వైసీపీలా చేతకానితనంతో కూర్చునేవాళ్లం కాదు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు? మళ్లీ వీళ్లను చేతకాని వ్యక్తులు అంటే నొచ్చుకుంటారు.