సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజున మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుండెపోటుతో మొదలైన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా చివరకు వైసీపీ నేతల కనుసన్నల్లో జరిగిన గొడ్డలిపోటు అని తేలేవరకు ఎన్నో మలుపులు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసు గురించి వివేకా తనయురాలు, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా నాలుగో వర్ధంతి సందర్భంగా తన తండ్రి సమాధి వద్ద ఆమె నివాళి అర్పించిన సందర్భంగా సునీతారెడ్డి మీడియాతో మాట్లాడారు.
తన తండ్రి దారుణ హత్యకు గురై నేటికి 4 సంవత్సరాలు పూర్తయిందని, అయినా న్యాయం జరగలేదని వాపోయారు. కానీ, తమకు, తమ కుటుంబానికి న్యాయం జరిగేందుకు పోరాడుతూ, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. తన తండ్రి చనిపోయిన మొదట్లో కడప, కర్నూలులో ఇలాంటి ఘటనలు మామూలే కదమ్మా, ఆందోళన ఎందుకని కొందరు అన్న విషయాన్ని సునీత గుర్తు చేసుకున్నారు. కానీ, అది తప్పు అని నిరూపించేందుకే తానీ ప్రయత్నం, పోరాటం చేస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో తన తండ్రికి పట్టిన దుస్థితి మరెవరికీ రాకూడదనే తాను పోరాడుతున్నానని అన్నారు. ఇది ఒకరిమీద కక్షతో చేసేది కాదని, నిజం అందరికీ తెలియాలనే ఈ పోరాటం అని చెప్పారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థలను ఎవ్వరూ ప్రభావితం చేయవద్దని కోరారు. ఈ కేసులో సొంత కుటుంబసభ్యుల మీద ఆరోపణలు చేస్తున్న విషయం తనకు తెలుసని చెప్పారు. కానీ, కేసు విచారణ దశలో ఉన్నందున తాను దానిపై మాట్లాడబోనని అన్నారు.
తనకు తెలిసిన విషయాలన్నీ మొదట్లో సిట్, తర్వాత సీబీఐకి ఇచ్చానని చెప్పారు. దర్యాప్తు గురించి, దర్యాప్తు సంస్థల గురించి కామెంట్ చేయకూడదని కోరారు. ఎవరికైనా ఏదైనా తెలిస్తే దయచేసి దర్యాప్తు సంస్థలకు తెలపాలని రిక్వెస్ట్ చేశారు. పోలీసులపై ఒత్తిడి పెట్టకుండా వారి పనిని వారు చేయనీయండని తాను మొదటి నుంచి చెబుతూ వస్తున్న విషయాన్ని సునీత గుర్తు చేశారు.