ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ మద్దతు ఇవ్వడంపై సజ్జల స్పందించడంతో షర్మిల ప్రతివిమర్శలకు దిగారు. గతంలో తన పార్టీతో సంబంధం లేదని చెప్పిన సజ్జల ఇప్పుడు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తన గురించి మాట్లాడడం కాదని, ఏపీ సంగతి చూసుకోవాలని చురకలంటించారు.
ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులపై కేసీఆర్ వ్యాఖ్యలపై సజ్జల స్పందించాలని హితవు పలికారు. ఏ సంబంధం లేకుండానే తన గురించి సజ్జల మాట్లాడుతున్నారని తాను భావిస్తున్నానని షర్మిల అన్నారు. తమ పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే తమ పార్టీతో సంబంధం కలుపుకుంటున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు.
ఏపీలో సింగిల్ రోడ్లు తెలంగాణలో డబుల్ రోడ్లు అని కేసీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించారని, చీకటైతే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అంటున్నారని, దానికి సజ్జల ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మరి, షర్మిల వ్యాఖ్యలపై సజ్జల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.