రాజకీయ విశ్లేషకులుగా మారిన మాజీ ఎంపీ.. రాజమండ్రి నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి పొద్దు పోయాక.. ఆయన ఇంటికి వెళ్లిన ఆమె దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అయితే.. యధాలాపంగా.. సాధారణ చర్చలేనని, గతంలో ఉన్న అనుబంధంతోనే ఇప్పుడు కలుసుకున్నామని.. ఇరువురు.. నాయకులు చెప్పుకొచ్చారు. అయితే.. రెండు గంటలపాటు చర్చించుకునే అంశాలు ఏంటనేది ఆసక్తిగా మారింది.
కొంత లోతుల్లోకి వెళ్తే.. వైఎస్ షర్మిల పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఒకవైపు కార్యకర్తలను సమీ కరిస్తూనే మరోవైపు.. ఉద్ధండ నాయకులుగా పేరొందిన నేతలను కూడా.. కలుస్తున్నారు. వారిని ఆహ్వాని స్తున్న మాట కూడా నిజం. “మీరుంటే.. నేను బలంగా నిలబడతా!“ అని ఆమె తాజాగా ఉండవల్లికి తేల్చి చెప్పారు. పార్టీలోకి రావాలని.. మీకు నచ్చిన స్థానం నుంచి పోటీ చేయాలని కూడా ఆమె చెబుతున్న మాట కూడా వాస్తవం.
మరీ ముఖ్యంగా రెండు సెంటిమెంట్లను షర్మిల ప్లే చేస్తున్నారు. ఒకటి వైఎస్‌తో ఈ నేతలకు ఉన్న అనుబంధం.. రెండు రాహుల్‌గాందీని ప్రధాన మంత్రిని చేయాలన్ని సెంటిమెంటును రంగరిస్తున్నారు. ఈ రెండు అంశాలను ప్రస్తావించి పాత కాపులను తిరిగి తమవైపు తిప్పుకొనే వ్యూహాన్ని బాగానే ప్లే చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే వారు రాజకీయంగా కొన్ని నిర్ణయాలు చేసుకుని ఉండడం.. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో షర్మిల ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నారు.
అయితే.. నేరుగా ఈ విషయాలు బయటకు చెబితే.. షర్మిల ఇమేజ్ దెబ్బతింటుందన్న వ్యూహంతో ఎవరికి వారు మౌనంగా ఉంటున్నారు. పైకి మాత్రం అబ్బే అదేం లేదు. అనేస్తున్నారు. కానీ, ఇలా అన్నారంటే.. చల్ల కొచ్చి ముంత దాచిన సామెతేనని అంటున్నారు పరిశీలకులు. ఏదీ లేకుండా.. గంటల తరబడి చర్చలు ఉండవు కదా! ఇక, ఉండవల్లి.. విషయంలో షర్మిల కూడాఇదే సెంటిమెంటు ప్లే చేసినా.. ఆయన సున్నితంగా తిరస్కరించారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొంటానని హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇదీ.. సంగతి!