ఆస్తుల వివాదంలో తన తల్లి, చెల్లిపై ఏపీ మాజీ సీఎం జగన్ కోర్టుకెక్కడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సరస్వతీ పవర్ కంపెనీలోని తమ షేర్లను షర్మిల, విజయమ్మ అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్, భారతీ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయమ్మ, షర్మిలలపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ కు వారు ఫిర్యాదు చేశారు. రాజకీయంగా తనను వ్యతిరేకించడం, తప్పుడు ప్రచారంతో తనకు చెడ్డపేరు తేవడం వంటి కారణాల వల్ల షర్మిలపై ప్రేమ లేదని, అందుకే షేర్లు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నానని జగన్ తెలిపారు.
ఈ క్రమంలోనే అన్న జగన్ కు చెల్లి షర్మిల కౌంటర్ ఇచ్చారు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్ సూటిగా సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ కాంక్షతోనే కడపలో తాను పోటీ చేస్తున్నానని జగన్ చెప్పారని, కానీ, తనను నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది జగనన్న కాదా అని ప్రశ్నించారు. భర్త, పిల్లలను వదిలి జగన్ కోసమే వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశానని షర్మిల ఎమోషనల్ అయ్యారు.
అప్పట్లో తన అన్న కోసమే పనిచేశానని బైబిల్‌పై ప్రమాణం చేస్తానని, అందుకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా? చెల్లి వ్యక్తిత్వాన్ని హననం చేయించిన అన్నగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని షర్మిల విమర్శించారు. వైసీపీ నాయకులు సోషల్ మీడియా ద్వారా తనపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న బిడ్డనన్న కనీసం ఇంగితం లేకుండా నాపై, నా పుట్టుకపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. జగన్‌కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది అందుకే భ్రమల్లో బతుకుతున్నారని దుయ్యబట్టారు. జగన్ మానసిక పరిస్థితిపై నాకు ఆందోళన ఉందని షర్మిల అన్నారు.