“తమ్ముడూ.. నువ్వు బీటెక్ చదువుతున్నావంటగా.. ఏం చేస్తుంటావ్. ఒకసారి ఆఫీస్‌కు వస్తే.. మనం మాట్లాడుకుందాం. చిన్న పని పెద్ద ఆదాయం“-ఇదీ.. వైసీపీ కీలక నేతలు.. కొందరు ఆయా జిల్లాల్లో యువతకు పోన్లు చేసి.. మరీ పిలుస్తున్నారు. ఇలా వచ్చిన వారి నుంచి కొందరిని జల్లెడ పట్టి ఏరుకుంటున్నారు. వీరిలో కొందరు వైసీపీ సానుభూతి పరులు కూడా ఉంటున్నారు. అయితే.. ఇదంతా కూడా.. లోలోనే జరిగిపోతోంది.
ఎక్కడా ఎలాంటి ప్రచారం లేకుండా.. నాయకులు యువతను నియమించుకుంటున్నారు. అయితే.. ఇలా బీటెక్చదువుతున్నవారు ఏం చేయాలంటే.. కొత్తగా ఒక యూట్యూబ్ ఛానెల్‌ను వారి పేరుతోనో.. సంస్థ పేరుతోనో.. ప్రారంభించాలి. దీనిలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలి. మరో ఇద్దరిని నియమించుకుని క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు(పార్టీలకు అనుకూలంగా ఉండేవారి) తెలుసుకుని వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి.
తద్వారా.. ప్రజల్లో ఆయా పార్టీలకు సానుభూతి పెరిగేలా చేయడమే వీరి లక్ష్యం. ఇదీ.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న కీలక కార్యక్రమం. రాష్ట్రంలో ఎన్నికలకు మరో 8 నెలల గడువు ఉంది. అయితే.. ఎన్నికలు భారీ పోటీగా ఉండడంతో వైసీపీ, టీడీపీలు.. ఎవరి వ్యూహాలను వారు అమలు చేస్తున్నారు. ప్రజలకు చేరువ కావడం ఒక్కటే ఇప్పుడు విధి కాదు. ప్రజల మనసులు గెలుచుకోవాలి. నాయకులతో సంబంధంతో పాటు.. విధాన పరమైన ఆలోచనలను కూడా ప్రజల మెదళ్లలో ఎక్కించాలి.
ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు.. చానెళ్లను, యూట్యూబ్‌లను ప్రమోట్ చేస్తున్నాయనే చర్చ తెరమీదికి వచ్చింది. ముఖ్యంగా యువతకు.. బాగా అవగాహన ఉన్నారని.. రాజకీయాలపై పట్టున్న వారికి ఇప్పుడు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తున్నారు. వసతులు సమకూర్చి.. నెలకు రూ.30 నుంచి 50 వేల వరకు కూడా వేతనాలు ఇస్తున్నారని తెలిసింది. మొత్తానికి ప్రజలను తమవైపు తిప్పుకోవడంలో పార్టీలు వ్యూహాలపై వ్యూహాలు వేస్తుండడం గమనార్హం.