వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్టు వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ పార్టీకి 40 శాతం ఓటింగ్ ఉందని, తనకు ఓటు వేసిన ప్రజలను కలిసేందుకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని మిథున్ రెడ్డి అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అయితే, మిథున్ రెడ్డి గతాన్ని మరచిపోతున్నారు. వైసీపీ చేస్తే సంసారం…టీడీపీ చేస్తే వ్యభిచారం అనే రీతిలో మిథున్ రెడ్డి మాట్లాడుతున్న మాటలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
2019 లో కూడా టీడీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయన్న విషయం మిథున్ రెడ్డికి గుర్తు లేదు కాబోలు. ఇక, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోకి ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును రాకుండా ఏ విధంగా అడ్డుకున్నారో అందరికీ తెలిసిందే. అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా రాళ్లదాడి చేసింది కాకుండా, ఆయనపైనే కేసు పెట్టడం ప్రజలు మరచిపోలేదు. ఇక, గోదావరి జిల్లాల్లో నారా లోకేశ్ యువగళ: పాదయాత్రను అడ్డుకునేందుకు మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంత అరాచకం జరిగిందో పాపం ఆయన మరిచిపోయినట్లున్నారు.
ప్రతిపక్ష నేతలను పక్కనబెడితే ఆనాడు వైసీపీ తరఫున గెలిచిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఐదేళ్లపాటు తన నియోజకవర్గంలో అడుగుపెట్టనివ్వకుండా ఎలా అడ్డుకున్నారో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారని మిథున్ రెడ్డికి గుర్తు లేదు కాబోలు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసిన మిథున్ రెడ్డి అండ్ కో ఇపుడు మాత్రం ఏమీ తెలియని అమాయకుల్లా మాట్లాడడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.