గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు పాల్పడిన అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రజలకే కాదు ఆఖరికి దేవుడికి సైతం శఠగోపం పెట్టిన ఘనత పుంగనూరు వైసీపీ నాయకులు సొంతం చేసుకున్నారు. అక్రమంగా వందల కోట్లు విలువ చేసే దేవుడి భూములను కొట్టేయడమే కాకుండా.. ఆ భూములను ఇతరులకు లీజుకు ఇచ్చి లక్షల రూపాయలు నొక్కేశారు.
మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డాలో ఈ బాగోతం వెలుగు చూసింది. పుంగనూరు నియోజకవర్గంలోని భోగనంజుండేశ్వర స్వామి ఆలయ భూములను, కాశీ విశ్వనాథ స్వామి ఆలయ భూములను అక్కడి వైకాపా నాయకులు కబ్జా చేశారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు దేవుడు భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించడానికి పుంగనూరు మున్సిపాలిటీ నుండి అనుమతి తెచ్చుకున్నారు. అలాగే కబ్జా చేసిన కొన్ని దేవుడి భూములను లీజుకు ఇచ్చి భారీ మొత్తంలో సంపాదించుకున్నారు.
అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని పడగొట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి పుంగనూరు వైసీపీ నాయకుల జాతకాలు మొత్తం సేకరించిన టీడీపీ నాయకులు.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పుంగనూరు, పలమనేరు, చౌడేపల్లి, పులిచెర్లతో సహా ఇతర ప్రాంతాల్లో కబ్జా అయిన దేవుని భూములపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు కబ్జా అయిన భూములను వెనక్కు తీసుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు. మొత్తానికి తమ కన్ను పడితే దేవుడి భూములనైనా వదలమని వైసీపీ నాయకులు నిరూపించుకున్నారు.