వంద గ్రాములు.. ఒక స్మార్టు ఫోన్ బరువు కంటే తక్కువ. కానీ.. అదే ఇప్పుడు కొంపముంచింది. భారత్ కు దక్కాల్సిన ఒలింపిక్ పతకం దక్కుండా చేసింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన బరువు కంటే కేవలం 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ను ఒలింపిక్స్ పోటీల నుంచి అనర్హత వేటు వేయటమే కాదు.. ఆమెను ర్యాంకింగ్ లో అట్టడుగు భాగాన ఉంచుతారు.
50కేజీల విభాగంలో పోటీ పడిన ఆమె.. వంద గ్రాముల బరువు అదనంగా ఉన్నట్లుగా గుర్తించారు. వినేశ్ బరువును ఉండాల్సిన 50 కేజీల వద్ద ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా.. ఫలించలేదంటున్నారు. వినేశ్ బరువు ను తగ్గించేందుకు వర్కువుట్లు.. ఆహారాన్ని.. పానీయాల్ని తగ్గించినప్పటికి ఫలితం ప్రతికూలంగా వచ్చిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
వినేశ్ ఫొగాట్ పై పడిన అనర్హత వేటుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం రియాక్టు అయ్యారు. ఆమెను ఓదారుస్తూ ఆయన ప్రకటన వెల్లడైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీనే కాదు.. పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి..ఆమెకు అన్యాయం జరిగిందన్న సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఓకే. అందరి సంగతిని పక్కన పెడితే.. ఇంతటి దారుణ పరిస్థితిని ఫేస్ చేస్తున్న వినేశ్ ఫొగాట్ ఎలా ఉన్నారు? ఆమె స్పందన ఏమిటి? ఆమె రియాక్షన్ ఎలా ఉందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
దీనికి సంబంధించి భారత టీం చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దాన్షా పార్డీవాలా వెల్లడించారు. పతకం కోల్పోయినందుకు బాధగా ఉన్నప్పటికీ ఇదంతా ఆటలో భాగమని వినేశ్ తమతో చెప్పినట్లుగా రెజ్లింగ్ జాతీయ కోచ్ వీరేందర్ దహియా వెల్లడించారు. అనర్హత వేటు పడిన తర్వాత వీరేందర్ తో పాటు భారత ఒలింపిక్ అసోసియేషన్ కు చెందిన కొందరు అధికారులు వినేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన తొలి రియాక్షన్ ను షేర్ చేసినట్లుగా చెబుతున్నారు.
అనర్హత వేటు పరిణామం రెజ్లింగ్ టీంలోని ప్రతి ఒక్కరూ షాక్ కు గురయ్యారని పేర్కొన్న వీరేందర్..తాము వినేశ్ ను కలిసి ఓదార్చే ప్రయత్నం చేశామన్నారు. ‘‘మనం పతకాన్ని కోల్పోయినందుకు బాధగా ఉంది. కానీ.. ఆటలో ఇది భాగం’’ అని వినేశ్ ఫొగొట్ వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా వినేశ్ ధైర్యంగా ఉందన్న మాట.. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదన్న విషయంపై అవగాహన పెంచటమే కాదు.. ఇలాంటి సందర్భాల్లో బయటపడతాయని చెప్పాలి.