అమరావతి రాజధానిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభిస్తామని లోకేష్ హామీనిచ్చారు. అమరావతి రీస్టార్ట్ కు ప్రజల ఓట్లే ఆక్సిజన్ అని, అంపశయ్యపై ఉన్న అమరావతికి..కూటమి గెలుపుతోనే పురోగతి అని అర్థం వచ్చేలా లోకేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ప్రజాగళం సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, ఈ సభతో ఆంధ్ర ప్రదేశ్ కు ఉజ్వల భవిష్యత్తు ఖాయమైందని లోకేష్ అన్నారు. సభను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు లోకేష్. జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అయిందని, ఏపీని గాడిలో పెట్టేందుకు కూటమిని ప్రజలు గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో పలు సామాజిక వర్గాలకు చెందిన తటస్థులతో లోకేష్ భేటీ అయి వారికి పలు విషయాలపై భరోసానిచ్చారు.
ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ఒక్క అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాత మంగళగిరిని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి ప్రాంతంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెజ్ ఏర్పాటు చేస్తామని, స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కోసం టాటా ట్రస్ట్ ద్వారా పైలట్ ప్రాజెక్టు మొదలుబెట్టామని, ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే తమ ప్రభుత్వం రాగానే రాష్ట్రమంతా ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని చెప్పారు. మైనార్టీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందని, జగన్ సర్కార్ వాటిని రద్దు చేసిందని మైనార్టీ సోదరులనుద్దేశించి లోకేష్ మాట్లాడారు.