తొందరలో జరగబోయే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల కమీషన్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు ఆన్ లైన్లోనే ఓట్లేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో చెప్పారు. వివిధ కారణాలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేయలేని వాళ్ళకోసం ఆన్ లైన్ ఓటింగ్ విదానాన్ని అమల్లోకి తీసుకురావాలని జనాలు ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.
వివిధ వర్గాల నుండి వినిపిస్తున్న డిమాండ్లను కమీషన్ దృష్టిలో పెట్టుకున్నట్లుంది. అందుకనే మేనెలలో జరగబోతున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రయోగానికి వేదికగా చేసుకున్నది. అయితే ఏ పద్దతిలో ఓట్లేయాలి, అందుకు అందుబాటులోకి తీసుకురాబోతున్న సాంకేతికత ఏమిటనేది విషయాలను మాత్రం చీఫ్ కమీషనర్ చెప్పలేదు. కమీషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 మందికి పైగా వికలాంగులున్నారట. అలాగే 100 ఏళ్ళు పైబడిన ఓటర్లు 17 వేలమంది ఉన్నట్లు చెప్పారు.
ఇక్కడే చీఫ్ కమీషనర్ చెప్పినలెక్కల్లో తేడా కనిపిస్తోంది. చీఫ్ కమీషనర్ వికలాంగులు, వృద్ధుల అంకెలను తారుమారు చేసి చెప్పారా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. సరే వికలాంగులు, వృద్ధుల సంఖ్య ఎంతన్నది పక్కనపెట్టేస్తే వీళ్ళంతా తమ ఇళ్ళల్లో నుండే ఓట్లేయచ్చన్నారు. ఇలాంటి వాళ్ళు తమ ఓట్లను నమోదు చేసుకునేందుకు ఫారం 12డి ని అందుబాటులోకి తేబోతున్నట్లు చెప్పారు. బహుశా ఈ ఫారం 12డి ఫిలప్ చేసి ముందుగానే కమీషన్ కార్యాలయంలో ఇవ్వాలేమో.
అప్పుడు కమీషన్ దరఖాస్తుదారులను నిర్ధారణ చేసుకుని ఆన్ లైన్లో ఓటింగ్ కు అవసరమైన సాంకేతికతను అందిస్తుందేమో చూడాలి. ఆన్ లైన్లో ఓటింగ్ అంటే ముందు ఇంటర్నెట్ ఉండాలి. కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ లాంటి వాటికి ఇంటర్నెట్ అనుసంధానం సక్రమంగా ఉండాలి. అన్నీ సరిగా ఉంటేనే ఆన్ లైన్లో ఓటింగ్ అనేది సజావుగా సక్సెస్ అవుతుంది. సరే ఏదైనా ప్రయోగదశలో కొన్ని సమస్యలు రావటం తర్వాత వాటిని అధిగమించటం మమూలే కదా. ఏదేమైనా ఆన్ లైన్లో ఓటింగ్ నిర్వహించటం, ప్రక్రియను అమల్లోకి తీసుకురావటమే గొప్ప విషయమనే చెప్పాలి. మరి కర్నాటక ప్రయోగం ఏమవుతుందో చూడాలి.
అంతా బాగుంది గానీ ఇంత కట్టడి మధ్యనే దొంగ ఓట్లను విశ్రుంఖలంగా వాడుతున్న జగన్ ఇక ఇంట్లోంచి ఓటేయొచ్చు అనే స్కీమ్ ఏపీలో తెస్తే అతన్ని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.