సీఎం జగన్ సొంత చిన్నాన్న, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు 2019 ఎన్నికలకు ముందు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, వివేకా మర్డర్ వెనుక పెద్ద తలకాయలున్నాయని సంచలన ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే గత నెలన్నరగా ఈ కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా వివేకా వాచ్మన్ రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం రాజకీయ దుమారం రేపుతోంది.
కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట రంగన్న వాంగ్మూలం ఇచ్చారని, ఈ కేసులో కీలక వివరాలు వెల్లడించారని తెలుస్తోంది. వివేకా హత్యలో ఇద్దరు ప్రముఖులు సహా మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వివేకా హత్యకు గురైన రోజు రాత్రి ఇంటికి ఐదుగురు కొత్తవ్యక్తులు వచ్చారని రంగన్న చెప్పినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కానీ, రంగన్న ఆ విధంగా చెప్పినట్టు సీబీఐ అధికారులు, పోలీసులు ధృవీకరించడం లేదు.
ఈ నేపథ్యంలో తాజాగా రంగయ్య సంచలన విషయాలు మీడియాకు వెల్లడించారు. హత్య జరిగిన రోజు వివేకా ఇంటికి వచ్చిన ముగ్గురిలో ఒకరు… తమ పేర్లు బయటికి చెబితే తనను నరికేస్తామన్నారని రంగయ్య చెప్పారు. అందుకే, తాను ఈ విషయం గురించి బయటకు చెప్పలేదని, సీబీఐ సారోళ్లు ధైర్యం చెప్పడంతో కోర్టులో ఈ విషయం చెప్పానని రంగయ్య వివరించారు.
మరోవైపు, కోర్టు నుంచి రంగన్నను పులివెందులకు తీసుకొచ్చిన అధికారులు జేఎన్టీయూ వద్ద వదిలేశారు. వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగయ్యను సీబీఐ అధికారులు ఒంటరిగా వదిలేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రంగన్నకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాల్సిన అవసరముందని తెలిసినా ఇలా చేయడంపై చర్చించుకున్నారు. రంగన్న ను లేపేసేందుకు వివేకాను హత్య చేసిన వారు స్కెచ్ వేస్తున్నారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.