మాన్సాస్ ట్రస్టు వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరకుమారుడిగా చలామణి అవుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి…అశోక గజపతిరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏ రోజైనా అశోక్ గజపతి జైలుకు వెళ్ళక తప్పదంటూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయికి మతిభ్రమించిందంటూ శోభనాద్రీశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కలలో కూడా అశోక్‌కు తప్పుడు ఆలోచనలు రావని కితాబిచ్చారు, కానీ, అశోక్ గజపతిపై విజయసాయిరెడ్డి ప్రకటన చూస్తే విజయసాయి మానసిక స్థితి సరిగ్గా లేదని అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలతో 16 నెలలపాటు విజయసాయి జైలులో గడిపారని, చాలాకాలంగా బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. బెయిల్ కాన్సిల్ అయితే ఏదో ఒకరోజు విజయసాయి తిరిగి ఊచలు లెక్కించాల్సిందేనని చురకలంటించారు.
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనుపిస్తుందని, ఇది విజయసాయికి వర్తిస్తుందని ఎద్దేవా చేశారు. ఆంధ్రా యూనివర్సిటీకి 600 ఎకరాలు దానం చేయడం, వేలకు వేల ఎకరాలు భూములను పలు దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు దానం చేయడం వంటి ఘన చరిత్ర అశోక్ కుటుంబానికి ఉందని గుర్తు చేశారు. క్విడ్ ప్రోకోలో వేల కోట్లు సంపాదించిన ఘనత జగన్ దని, అందులో ఏ2గా పేరున్న విజయసాయిరెడ్డి అశోక్‌ను విమర్శించడం…. సూర్యునిపై ఉమ్మి వేయడానికి ప్రయత్నించడమేనని హెచ్చరించారు.