లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచారు. రామ్ విలాస్ పాశ్వాన్ మృతిని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు. కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన మృతిచెందడం ఎల్జేపీకి తీరని లోటుగా నేతలు భావిస్తున్నారు. పాశ్వాన్ హఠాత్మరణంపై పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి తప్పుకుని సొంతంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, జనతాదళ్(యు)పై మాత్రమే తాము పోటీ చేస్తామని, బీజేపీకి వ్యతిరేకం కాదని లోక్ జనశక్తి(ఎల్జేపీ) అధినేత రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. అయితే, ఎల్జేపీ 42 సీట్లు కోరితే కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తానని బీజేపీ చెప్పడంతో ఎన్డీఏ నుంచి వైదొలిగామని పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ కొద్ది రోజుల క్రితం చెప్పారు.