దివంగత సీఎం వైఎస్సార్ తనయురాలు, ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో ‘వైఎస్సార్ టీపీ’ పార్టీ పెట్టి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమలంలోనే ఇప్పటికే ఉద్యోగుల కోసం ధర్నాతో పాటు పలు నిరసన కార్యక్రమాలు, పర్యటనలు చేస్తున్న షర్మిల…పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అవకాశమొచ్చినప్పుడల్లా అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్న షర్మిల…తెలంగాణలో వైఎస్ అభిమానులు, వైసీపీ అభిమానులను తన పార్టీవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులతో రాజకీయ భేటీలు నిర్వహించిన షర్మిల….వేరే పార్టీలలోని అసంతృప్త నేతలకు గేలం వేస్తున్నారు. ఇప్పటికే అజహరుద్దీన్ తనయుడు, సానియా మీర్జా సోదరిల జంటతో షర్మిల భేటీ అయ్యారు. వీరు త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వైఎస్ఆర్టీపీ కోసం వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో బ్రదర్ అనిల్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం నాడు జరిగిన వీరి భేటీ లోటస్ పాండ్ లో కాకుండా వేరే ప్రాంతంలో జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు, కొద్దిరోజులుగా బ్రదర్ అనిల్‌తో రాజయ్య తరచూ భేటీ అవుతున్నారని తెలుస్తోెంది. అయితే, ఈ భేటీ మతపరమైనదా. లేకుంటే రాజకీయపరమైనదా అన్నది తేలాల్సి ఉంది. మతపరమైన భేటీ అయితే, అఫిషియల్ గా లోటస్ పాండ్ లోనో బహిరంగంగా అందరికి తెలిసేలా భేటీ అయ్యేవారని, ఇది రాజకీయ భేటీ కాబట్టే సీక్రెట్ గా జరిగిందని ప్రచారం జరుగుతోంది. మరి, ఈ భేటీపై రాజయ్య , బ్రదర్ అనిల్ స్పందన ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.