గత ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించిన లెక్కలు బయటకు వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన వివరాల్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసింది. ఈ వివరాలన్నింటిని ఆయా రాజకీయ పార్టీలు తమకు అందిన విరాళాల్ని ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల ఆధారంగా తయారు చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గత ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలు దక్కించుకున్న మొత్తం విరాళాలు అత్యధికం ఐదు పార్టీలకే వచ్చినట్లుగా తేలింది. మొత్తం విరాళాల్లో 91 శాతం కేవలం ఐదు పార్టీలకే వచ్చాయి. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలు దక్కించుకున్న మొత్తం విరాళాలు రూ.113.79 కోట్లుగా వెల్లడించింది.
ఇందులో 91 శాతం నిధులు ఐదు ప్రాంతీయ పార్టీలకే అందాయి. ఈ ఐదు ప్రాంతీయ పార్టీలు అధికార పార్టీలు కావటం గమనార్హం. దీనికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన మినహాయింపుగా చెప్పాలి. గత ఆర్థిక సంవత్సరంలో 27 ప్రాంతీయ పార్టీలకు కలిపి 3051 మంది నుంచి అందిన విరాళాల ద్వారా మొత్తం రూ.123.53 కోట్లు అందాయి. అందులో ఐదు పార్టీలకు వచ్చిన మొత్తాలు రూ.113.79 కోట్లు. అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీగా జేడీయూ నిలిచింది. ఆ పార్టీకి 330 విరాళాల ద్వారా రూ.60.15 కోట్లు అందాయి.
అత్యధిక విరాళాలు అందుకున్న ఐదు పార్టీలు చూస్తే..
1. జేడీయూ రూ.60.15 కోట్లు
2. డీఎంకే రూ.33.89 కోట్లు
3. ఆమ్ ఆద్మీ రూ.11.32 కోట్లు
4. ఐయూఎంఎల్ రూ.4.16 కోట్లు
5. టీఆర్ఎస్ రూ.4.15 కోట్లు
2019-20తో పోలిస్తే తమకు వచ్చే విరాళాలు పెరిగినట్లు జేడీయూ.. డీఎం.. టీఆర్ఎస్ లు ప్రకటించాయి. అదే సమయంలో తమకు రావాల్సిన విరాళాలు తగ్గినట్లుగా ఆప్.. ఐయూఎంఎల్ వెల్లడించాయి. సంపన్న పార్టీగా అభివర్ణించే టీఆర్ఎస్ కు.. అతి తక్కువ విరాళాలు రావటం ఏమిటో?