సీఎం జగన్ కేంద్రంగా సెటైర్లు పేలుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఓ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ డైలాగులను ఉటంకిస్తూ.. జగన్ ఎమోజీలతో నెటిజన్లు ఓ ఆట ఆడేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురంలో తలెత్తిన అల్లర్ల నుంచి నిన్నగాక మొన్న జగన్ విడుదల చేసిన ఉచిత వ్యవసాయ బీమా వరకు.. కౌలు రైతుల మరణాల నుంచి `గడప గడపకు మన ప్రభుత్వం` కార్యక్రమం దాకా.. దేనినీ వదలకుండా.. సీఎం జగన్ తప్పులను ఎత్తి చూపుతూ.. నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
అమలాపురం విషయంపై..
అమలాపురం అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లను ఆందోళన కారులు నిప్పు పెట్టారు. పోలీసుల వాహనాలను కూడా దహనం చేశారు. అయితే.. ఈ విషయంలో జగన్ మాత్రం తప్పును ప్రతిపక్షాలపై నెట్టేశారు. మరోవైపు.. సాక్షాత్తూ ఇల్లు కాలిపోయిన మంత్రి విశ్వరూప్ మాత్రం.. ఈ ఘటన వెనుక.. తమ పార్టీ నాయకులే ఉన్నారని చెప్పారు. ఇక, పోలీసులు కూడా ఈ ఘటనల్లో బాధ్యులుగా.. వైసీపీకి చెందిన వారినే అరెస్టు చేస్తున్నారు. అయినప్పటికీ.. జగన్ మాత్రం బుకాయిస్తున్నారు. దీనిని కోట్ చేస్తూ.. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
“ఒక పక్కన స్వయంగా మంత్రి అనుచరులే చట్ట వ్యతిరేక ర్యాలీ నిర్వహించాలని పిలుపు ఇస్తారు. అల్లర్లు, దహనాలు జరుగుతాయి. మంత్రి తమవారి పనే అంటాడు. ఆ దిశగా మంత్రి అనుచరులే అరెస్టులు అవుతుంటే, ప్రతిపచ్చ నాయకులు, మరీ ముఖ్యంగా జనసేన కుట్ర అంటాడు“- ఆయన్నెవరికైనా చూపించండ్రా! అంటూ సటైర్లు వేస్తున్నారు.
కౌలు రైతుల మరణాలపై..
రాష్ట్రంలో జగన్ సర్కారు హయాంలో కౌలు రైతులు మృతి చెందారని ఆరోపిస్తూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. సీఎం జగన్ మాత్రం ఇదంతా రాద్ధాంతం అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో చనిపోయినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీస్తున్నారు. అంతేకాదు.. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న కౌలు రైతు చచ్చిపోతే.. ఆదుకుంటున్నామని చెప్పారు. దీనిపైనా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
“కౌలు రైతు బలవన్మారణాలు అంటే, పట్టాదారు పాసు పుస్తకం అంటాడు. కౌలుదారు గుర్తింపు పత్రం లేని ప్రతీవాడు అసలు కౌలుదారు కాదంటాడు. తానే ఒక పక్కన మన రాష్ట్రంలో 35 లక్షల కౌలు రైతులు ఉన్నారంటాడు. ప్రతిపచ్చంలో ఉన్నప్పుడు. కానీ తన ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు కేవలం 5 లక్షల మందికి మాత్రమే కౌలుదారు గుర్తింపు పత్రం ఇచ్చాడు. అంటే, అయన చెప్పిన పాత లెక్కలు ప్రకారం చూసినా, మిగిలిన 30 లక్షల మంది కౌలురైతులు కాదనమాట? ఏందుకంటే ఈయన గుర్తించలేదు కాబట్టా?“- ఆయన్నెవరికైనా చూపించండర్రా!! అని సటైర్లతో విరుచుకుపడుతున్నారు.
ఇక, నవరత్నాలపై..
“ఒక పక్కన నవరత్నాలకు 87% ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటాడు. మరోక పక్కన గడప గడపకు అంటూ 8 నెలల పాటు ఎమ్మెల్యేలు తిరగమంటాడు? కాబట్టి 175 కి 175 అంటాడు?“ ఆయన్ని అలా వదిలేయకండ్రా? ఏవరికైనా చూపించడ్రా? అని వ్యాఖ్యలు సంధిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు జోరుగా ట్రెండ్ అవుతుండడం విశేషం. చూసిన వాళ్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఇదీ.. సంగతి!!