సీఎం జగన్ పాలనపై గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక, ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలో రోడ్లన్నీ చెరువులు, తటాకాలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ పై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. డైరీ రంగంలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన అమూల్ ఇండియాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గేదెల సాంత్వనకోసం జగనన్న ఆరాటపడుతున్నారని ట్రోలింగ్ జరుగుతోంది. అమూల్ కు ప్రజలు పాలు పోస్తున్నందున గేదెల కోసం జగనన్న స్విమ్మింగ్ పూల్ కట్టించారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
ఇక, ఇటీవల ముగిసిన రాఖీ పండుగ సందర్భంగా జగన్ కు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతోపాటు పలువురు మహిళలు రాఖీ కట్టారు. రాఖీ కడుతున్న రోజు…పేరంటంలో ముత్తయిదువులు తాంబూలం తీసుకోవడానికి చేతులు పెట్టినట్లు జగన్ చేతులు పెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ముత్తయిదువులా నుదుటన జగన్ పెద్ద బొట్టు పెట్టుకున్నారని, చేతిలో తమలపాకు, జాకెట్, పసుపు కుంకుమ ఉన్నాయా అంటూ కొందరు నెటిజన్లు మీమ్స్ తో పంచ్ లు వేస్తున్నారు. అరటి పండ్ల వాయినం కోసం జగన్ చేతులు చాచడం ఏదైతే ఉందో అంటూ సెటైరికల్ పోస్టులు పెట్టి జగన్ పరువు తీస్తున్నారు.
ఇక, అంతర్వేది సముద్ర తీరంలో సముద్రం రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లడంతో ఇసుక లోడ్లు ఎత్తాలంటూ వైసీపీ నేతల ఇసుక దోపిడీపై కూడా ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ పాలనలో ఏపీలో ఇసుక ధరలు ఆకాశాన్నంటిన వైనంపై గతంలోనే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. మరోవైపు, వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామంటూ నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల గురించి విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడడంపైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి జగన్ సర్కారును విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా నెటిజన్లు వదలడం లేదన్నది ఈ మీమ్స్ తో అర్థమవుతోంది. మరి, ఇకపైనైనా వైసీసీ నేతలు నెటిజన్లకు దొరక్కుండా కామెంట్లు చేస్తారో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా, ఈ ట్రోలింగ్ ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.