ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు పెద్ద ఇరకాటంలో పడ్డారు. రెండు విషయాలపై వారు వ్యవహరిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్రస్థా యిలో ట్రోల్ చేస్తున్నారు. “ముఖం చెల్లట్లేదా ముఖ్యమంత్రులూ!“ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఈ విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. ముందు ఏపీ సీఎం జగన్ వ్యవహారాన్ని తీసుకుంటే… శనివారం(ఈ నెల 8న) దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వైఎస్ షర్మిల, ఆమె కుమార్తె రాజారెడ్డి, కుమార్తె అంజలి, మాతృమూర్తి విజయమ్మలు పులివెందుల చేరుకున్నారు. శనివారం జరిగే ప్రార్థనల్లో వారు పాల్గొంటారు.
అయితే.. ఇదే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ కూడా హాజరుకావాల్సి ఉంది. సీఎం జగన్ తన తల్లి, సోదరి షర్మిలకు ఎదురు పడకుండా.. ఉండేలా ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. శుక్రవారం రాత్రి షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆమె శనివారం ఉదయం వైఎస్‌కు నివాళులర్పించి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. ఇక, సీఎం జగన్ వాస్తవానికిశనివారం ఉదయమే అక్కడకు వెళ్లాలని షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. కానీ, వీరి రాక పై సమాచారం అందడంతో ఆయన అనూహ్యంగా షెడ్యూల్‌ను మార్చేసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం జగన్ ఇడుపులపాయకు రానున్నారు. దీంతో తనసోదరి, మాతృమూర్తిని చూసేందుకు కూడా మొహం చెల్లట్లేదా? అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్ర మోడీ కూడా శనివారమే తెలంగాణకు రానున్నారు. వరంగల్‌లో ఆయన రైల్వే వ్యాగన్ వర్క్‌షాపును ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో వైరం ఉన్నప్పటికీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో మెత్తబడ్డ మోడీ.. ఆయనను ఈ కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానించినట్టు తెలిసిందే. అయితే.. దీనికి సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దీనిపైనా.. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించరా? అని ప్రశ్నలు కురిపిస్తున్నారు. మరికొందరు ముఖం చెల్లట్లేదా? అని అంటున్నారు.