హీరోలు రాజకీయ వ్యవహారాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తారు. వాళ్ల పరిమితులు వాళ్లకుంటాయిలే అనుకోవచ్చు. దాన్ని తప్పుబట్టలేం. కానీ వేరే రాష్ట్రంలోనో.. ఇంకో దేశంలోనో సమస్యల మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు వేసేవాళ్లు.. స్థానిక సమస్యల మీద అసలే మాట్లాడకపోవడం మాత్రం విడ్డూరంగా అనిపిస్తుంటుంది.
జల్లికట్టు మీదో.. ఆస్ట్రేలియాలో అడవులు కాలిపోతుంటేనో తెగ బాధ పడే హీరోలకు.. ఏపీలో మడ అడవులు ధ్వంసమైపోతుంటేనో.. అమరావతిలో రైతుల బతుకులు బుగ్గిపాలవుతుంటేనో స్పందించడానికి అస్సలు మనసు రాదు.
ఇదే హీరోలు రాజకీయ నాయకుల్ని పొగడ్డానికి మాత్రం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. అంతే కాదు.. రాజకీయ నాయకులకు ప్రయోజనం చేకూర్చేలా ట్వీట్లు వేయడానికీ వెనుకాడరు. తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడ్డ దగ్గర్నుంచి కేసీఆర్, కేటీఆర్‌లను పొగడ్డానికి మన హీరోలు ఎలా పోటీ పడుతూ వస్తున్నారో చూస్తూనే ఉన్నాం.
దాన్ని కూడా అర్థం చేసుకోగలం కానీ.. ఇప్పుడు కేటీఆర్ వేసిన ఒక పొలిటికల్ ట్వీట్ మీద మన హీరోలు, ఇతర ఫిలిం సెలబ్రెటీలు స్పందిస్తున్న తీరు చూస్తే మాత్రం ముక్కున వేలేసుకోకుండా ఉండలేం.
కేంద్రంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టాలని చూసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కోసం అమరులైన వారికి, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారికి సాయం అందించడంలో కేసీఆర్ సర్కారు ప్రదర్శించిన నిర్లక్ష్యం గురించి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ లక్ష్యంలో ఉత్తరాది రైతులకు పరిహారం ప్రకటించారు కేసీఆర్. ఈ విషయమై కేటీఆర్ ఒక ట్వీట్ వేస్తూ కేసీఆర్‌ను కొనియాడారు.
ఐతే ఈ ట్వీట్ మీద నాని, రామ్, రానా దగ్గుబాటి, రవితేజ, తమన్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు వేస్తుండటమే విడ్డూరం. వీళ్లేమైనా వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు చేసిన ఉద్యమం మీద ఇంతకుముందెప్పుడైనా స్పందించారా.. మద్దతు ప్రకటించారా అంటే అదేమీ లేదు.
ఇప్పటిదాకా స్పందించని వాళ్లు ఉన్నట్లుండి కేటీఆర్ ట్వీట్‌పై స్పందిస్తూ.. సూపర్బ్ అని.. అమేజింగ్ అని.. ట్వీట్లు వేయడం చూసి జనాలకు మైండ్ బ్లాంక్ అవుతోంది. ఇవి బలవంతపు ట్వీట్లని సామాన్య జనాలకు అర్థం కాదని అనుకోవడం భ్రమ.