లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా టాలీవుడ్ నటుడు పృథ్వీ రాజ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరో విశ్వక్ వచ్చి సారీ చెప్పినా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు శాంతించలేదు. పృథ్వీ వచ్చి సారీ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారానికి తెరదించేలా పృథ్వీ వచ్చి సారీ చెప్పారు. ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ లైలా’ అని అన్నారు.
గోదారోళ్లకు ఎటకారం వెన్నతో పెట్టిన విద్య అని, ఆ ఫ్లోలో తాను అలా మాట్లాడానని చెప్పారు. అయితే, వ్యక్తిగతంగా తనకు ఎవరిపై ఎటువంటి ద్వేషం లేదుని, రాజకీయాలు వేరే వేదిక మీద మాట్లాడుకుందామని అన్నారు. అయితే, తన వల్ల సినిమాకు ఇబ్బంది కలుగుతోందని, సారీ చెప్పమని డైరెక్టర్ వీర శంకర్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన వల్ల చిత్ర యూనిట్ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో క్షమాపణలు చెబుతున్నానని, ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకుదమాని అన్నారు.
లైలాను బాయ్ కాట్ చేయవద్దని, ఫలక్నుమాదాస్కు మించిన విజయం ఈ సినిమా విశ్వక్ సేన్ కు అందిస్తుందని అన్నారు. ఇక, ఓ వ్యక్తి తనతో నీచంగా మాట్లాడాడని.. 20 ఏళ్ల క్రితం చనిపోయిన తన అమ్మను కూడా తిట్టాడని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం కూడా దెబ్బతినేలా చేశాడని అన్నారు. అయితే, తన తల్లిని దూషించారని కోపం వచ్చిందని, కాబట్టి తాను కూడా బూతులు తిట్టానని, ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కు తీసుకుంటున్నానని అన్నారు. అదే మాదిరిగా తనను దూషించిన వైసీపీ కార్యకర్తలు కూడా తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఇకనైనా ఈ వివాదానికి వైసీపీ కార్యకర్తలు పుల్ స్టాప్ పెడతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.