మెగా వర్సెస్ అల్లు వివాదం రోజురోజుకు ముదిరిపోతోంది. వాస్తవానికి తెలుగు సినిమా పరిశ్రమలో మెగా, అల్లు ఫ్యామిలీలను వేర్వేరుగా ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా.. మెగా, అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన విషయాన్ని పట్టించుకోకుండా.. అల్లు అర్జున్ ఫ్రెండ్షిప్ పేరుతో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తరఫున ప్రచారం వివాదం అయింది.
అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు అల్లు అర్జున్ కు యాంటీగా మారిపోయారు. ఆ తర్వాత నాగబాబు పరోక్షంగా అల్లు అర్జున్ ను ఉద్ధేశించి ఘాటుగా ట్వీట్ పెట్టడం, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ హాజరు కాకపోవడం, పుష్ప సినిమా కథాంశాన్నే తప్పు పడుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్ చేయడం తదితర అంశాలు మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఆజ్యం పోశాయి. ఇక నిన్న మొన్నటి వరకు అభిమానుల వరకు మాత్రమే పరిమితమైన మెగా-అల్లు వార్.. ఇప్పుడు పొలిటికల్ గా మారిపోయింది.
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జ్ చలమల శెట్టి రమేష్ బాబు తాజాగా అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్ వేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నారట. వచ్చే నెల 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో.. ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో భారీ ఎత్తున వేడుకలు జరగబోతున్నాయి. ఈ వేడుకులకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. అయితే వారితో పాటు అల్లు ఫ్యామిలీ సైతం వెళ్లబోతుందట. నంద్యాలలో మొదలైన వార్‌కు పవన్ బర్త్‌డే నాడే ముగింపు పలకాలని అల్లు ఫ్యామిలీ నిర్ణయించుకుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.