పల్నాడు జిల్లా మాచర్లలో అధికార పార్టీ నేతలు వీరంగం సృష్టించారు, ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టిన టిడిపి నేతలు, కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో వైసిపి నేతలు, కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మాచర్ల టిడిపి ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకే పధకం ప్రకారం వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మాచర్ల బస్టాండ్ సెంటర్లో వాహనాలకు నిప్పు పెట్టి అక్కడ భయానక వాతావరణం సృష్టించారు.
అంతేకాదు, మాచర్ల టిడిపి కార్యాలయంపై, జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటిపై కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతోపాటు, టిడిపి నేతలు, కార్యకర్తలు ఇళ్ళను టార్గెట్ చేసి ఇళ్లపై కూడా రాళ్లు, కర్రలతో దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వైసీపీ, టిడిపి వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. దీంతో, టిడిపి నేత జూలకంటి బ్రహ్మారెడ్డిని అక్కడి నుంచి పోలీసులు బలవంతంగా గుంటూరుకు తరలించారు.
అయితే శాంతియుతంగా కార్యక్రమం చేపట్టామని, వైసిపి వర్గాలే కవ్వింపు చర్యలకు పాల్పడి తమను రెచ్చగొట్టారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, పోలీసులను అడ్డుపెట్టుకొని తమపై దాడులకు తెగబడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్లలో ఈరోజు 144 సెక్షన్ విధించారు. మాచర్లలో ఫ్యాక్షన్ రాజకీయాలున్నాయని, ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో జరిగిన ఈ వివాదానికి రాజకీయ రంగు పలువుతున్నారని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి చెబుతున్నారు.
ఏదేమైనా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే వైసిపి వర్గాలు ఈ దాడులకు తెగబడినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా మాచర్లలో పర్యటించేందుకు వచ్చిన బుద్ధా వెంకన్న వాహనంపై మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ కిషోర్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇంకా చెప్పాలంటే ఆ దాడి చేసిన తర్వాతే కిషోర్ కు మున్సిపల్ చైర్మన్ పదవి దక్కింది.