2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓటమి టార్గెట్ గా ఏర్పడిన టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసిన సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీల పొత్తు పొడిచిన నేపథ్యంలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, బీజేపీ నేత గజేంద్ర సింగ్ షకావత్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్న విషయాలపై చర్చించేందుకు వీరు సమావేశమయ్యారు.
ఈ భేటీ తర్వాత పొత్తులో భాగంగా జనసేన-బీజేపీలకు కలిపి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. 31 అసెంబ్లీ స్థానాల్లో 21 జనసేనకు, 10 బీజేపీకి కేేటాయించారు. 8 లోక్ సభ స్థానాల్లో 2 జనసేనకు, 6 బీజేపీకి కేటాయించారు. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయబోతోంది. గతంలో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ తమతో కలిసి వస్తే సీట్ల సర్దుబాటులో మార్పులు చేర్పులు ఉంటాయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలిపిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సీట్ల కేటాయింపులలో స్వల్ప మార్పులు జరిగాయి. అధికారికంగా సీట్ల పంపకంపై పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన చేశారు. ఏ పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తుంది అన్న విషయంపై త్వరలో ప్రకటన చేస్తామని పవన్ అన్నారు.
మరోవైపు, మార్చి 17న టీడీపీ-జనసేన-బీజేపీ తొలి ఉమ్మడి సభ చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 3 పార్టీలలోని 13 మంది నేతలతో కమిటీని నియమించారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతుండడంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.