తాజాగా అనేక నాటకీయ పరిణామాల పర్యవసానంగా ‘తానా’ బోర్డు ఆదేశాలపై ‘తానా’ ఎలక్షన్ షెడ్యూల్ ను ఐనంపూడి కనకంబాబు ఆధ్వర్యంలోని ‘తానా’ ఎలక్షన్ కమిటీ ప్రకటించింది. మొదటగా ‘తానా’ కార్యవర్గాల్లోని అన్ని పదవులకు నామినేషన్లను ఈ ఫిబ్రవరి నెల 16 లోగా పంపించాల్సి ఉంటుంది. అలాగే తొలిసారిగా ‘తానా’ ఎలక్షన్ లో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్’ ద్వారా నిర్వహించేటట్లుగా నిర్ణయం జరగడం ఒక ‘చారిత్రాత్మక’ నిర్ణయంగా నిలిచిపోవటమే కాక, చాలా కాలంగా కొద్దిమంది చేతుల్లో ఇరుక్కున్న ‘తానా’ సంస్ఠను తిరిగి గాడిలో పెట్టడానికి అవసరమైన సంస్కరణల దిశగా తొలి మెట్టుగా పలువురు భావిస్తున్నారు. సరైన అనుభవం, సమర్థత, అంకితభావం లేకుండానే స్వంత నిధులతో ఓట్లు చేర్పించి, ఆయా బాలట్ కవర్ల కలెక్షన్ బలంతో ‘తానా’ అధ్యక్ష పదవి తో సహా అనేక పదవుల్లోకి చేరిన అనేక మంది చేస్తున్న నిర్వాకాలవల్లే నాయకులు వివిధ వర్గాలు గా విడివడి కొట్లాడుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని మనందరికీ తెలుసు.ఇప్పటినుంచైనా, నిస్పాక్షిక ఎన్నికల ద్వారా సభ్యుల మద్దతుతో ఎన్నికయ్యే కార్యవర్గాల నిబద్దతతో ‘తానా’ పూర్వ వైభవాన్ని పొందే రోజు అతి దగ్గరలోనే ఉందని అందరూ ఆశిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పలువురు ‘తానా’ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్టుగా అనుకుంటున్నప్పటికీ ‘నమస్తే ఆంధ్ర’ అవగాహన మరియు సమాచారం మేరకు ముగ్గురు హేమా హేమీలు బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరి గురించి క్లుప్తంగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నరేన్ కోడాలి: వర్జీనియా రాష్ట్రము లో నివసించే నరేన్ కోడాలి గతం లో బోర్డు చైర్మన్ గా వ్యవహరించడమేకాక, 2021 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడి 2023 ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తానని ఘంటాపధంగా చెప్తున్నారు. దశాబ్ద కాలం పాటు ‘తానా’ ని కంట్రోల్ చేసిన అధిష్ఠాన త్రయానికి అత్యంత ప్రేమ పాత్రుడిగా వ్యవహరించి వారి ప్రాపకం తోనే గతంలో పోటీచేసినప్పటికీ, ఇప్పుడు మాత్రం స్వతంత్రం గా వ్యవహరిస్తూ పోటీ చేస్తానని చెబుతున్నారు. అంతేకాక కొద్ధి సంవత్సరాలుగా ‘తానా’ లో సంప్రదాయకంగా జరుగుతున్న సభ్యత్వాల చేర్పింపుడులో దూకుడు ప్రదర్శించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ వారి ఓట్లు కేటాయింపు విషయమై ఖంగు తిని ప్రస్తుతం అదే విషయం లో కోర్టులతో, లాయర్లతో ఖర్చుతో కూడిన బిజీ గా ఉన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకోవాల్సిన ప్రస్తుత సమయం లో ‘సొమ్ము పోయే=శనీ పట్టే’ చందంగా తాను చేర్పించిన సభ్యులకు ఓట్లు వచ్చేవరకు ఎన్నికలు ఆపించే పనిలో తీరిక లేకుండా పోయింది. 2019 లో సతీష్ వేమన అధ్యక్షులుగా జరిగిన ‘తానా’ కాన్ఫరెన్స్ కు చైర్మన్ గా వ్యవహరించినప్పటికీ, అదే కాన్ఫరెన్స్ లెక్కలపై ఇప్పటికీ గందరగోళం జరుగుతుండడం కొంత ప్రతికూలం. మంచి వ్యక్తి, విద్యావంతుడు అయినప్పటికీ, అధ్యక్షుడిగా గెలిస్తే పాత అధిష్ఠానమే పెత్తనం చెలాయిస్తుందనే పలువురి భయం ఈయనకు ఇబ్బందికరమే.
బలాలు: గతంలో పోటీ చేసి ఓడిపోయిన సింపతీ, పాత అధిష్ఠానం అండ, గతంలో తనపై గెలిచిన వర్గంలో నుంచి చీలి వచ్చిన లావు వర్గం తోడ్పాటు, ఏదైనా అద్భుతం జరిగితే కొత్తగా చేర్పించిన సభ్యులకు వచ్చే ఓట్లు, ఎలక్షన్ పోస్టుపోన్ కై చేసే పోరాటం సఫలమైతే వచ్చే అనుకూల వాతావరణం.
బలహీనతలు: చేర్పించిన సభ్యుల కు ఓట్లు సాదించుకోలేకపోవటం, న్యాయపోరాటాల్లో తలమునకలుగా ఉండటం, గతంలో ఊరూరా తిరిగి సహకరించిన పలువురు ఈ సారి డుమ్మా కొట్టటం, ముఖ్య నాయకులు కొంతమంది కాన్ఫరెన్స్ పనుల్లో తలమునకలు కావడం, తమతో గతంలో పోరాడి మద్దతుగా వచ్చిన లావు వర్గంతో పనిచేయడంపై కొందరి అసహనం, ప్యానెల్ కూర్పులో తడబాటు, సమస్యలను గుర్తించడం, పోరాడటము మరియు వ్యూహ రచనలో పొరపాట్లు, పూర్వపు అధిష్టానం పై ఇంకా తొలగని వ్యతిరేకత తో పాటు బాలట్ కలెక్టర్ల మాడు పగలు కొడుతున్న ఎలక్ట్రానిక్ ఆన్లైన్ ఓటింగ్.
శ్రీనివాస గోగినేని: మెట్రో డిట్రాయిట్ మిచిగాన్ లో నివసించే శ్రీనివాస గోగినేని తన విలక్షణమైన వ్యక్తిత్వము, అనుభవం తో పాటు ‘తానా’ పై అంకిత భావం కలిగిన వారిగా అత్యధిక ‘తానా’ సభ్యులకు సుపరిచితుడు. గతంలో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ గాను, 2015 ‘తానా’ కాన్ఫరెన్స్ కార్యదర్శి గాను నిర్వహించిన పదవులను వివాదాలకు తావు లేకుండా సమర్ధవంతంగా నిర్వహించిన ఖ్యాతి తో పాటు 2017, 2021 లలో స్వతంత్ర అభ్యర్థి గా ‘తానా’ అధ్యక్షుడిగా పోటీ చేసి ఓటమి పొందడం కూడా తెలిసిందే. ప్రస్తుత వర్గాలన్నీ పాత అధిష్టానంతో కలిసి ఉన్నప్పుడే వారి ఆధిపత్య ధోరణిపై, బాలట్ కలెక్షన్లతో ఎన్నికల రిగ్గింగ్ పై అలుపెరగని పోరాటం చేసినప్పటికీ వ్యక్తిగత స్థాయిలో మూడు వర్గాలతోను సఖ్యతగా ఉండగలగడం ఈయనకే సాధ్యం. అలాగే ప్రచారంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులతో కూడా ఉన్న సాన్నిహిత్యానికి తోడు అట్లాంటా లావు బ్రదర్స్ తో ప్రత్యేక సంబంధాలు ముందునుంచీ ఉండడం కొసమెరుపు. వెరసి అన్ని వర్గాలు కలిసి వస్తే ప్రస్తుతం కకావికలుగా ఉన్న ‘తానా’ పరిస్థితికి ఒక సమాధానంగా మధ్యేమార్గంగా అందరికీ ఆమోద యోగ్యుడని పలువురు భావిస్తున్నారు. అయితే అది ఇతర ఆశావహుల పట్టువిడుపుల పైనే ఆధారపడి ఉంటుంది. గోగినేని తన వ్యక్తిగత సంభాషణలలో స్వతంత్రం గా మళ్లీ పోటీ చేయడానికి విముఖుడనని, కుదిరితే అందరికీ ఆమోదయోగ్యుడిగా అన్ని వర్గాలకూ న్యాయం చేసే విధంగా మొదటి ప్రయత్నం,అలా కాకపోతే పూర్తిస్థాయి ప్యానెల్ కుదిరితే మాత్రమే మళ్ళీ పోటీ కి వస్తానని చెప్తున్నారు. ‘తానా’ ప్రస్తుత పరిస్థితి అందుకు అనుగుణంగానే ఉన్నప్పటికీ ఏ ఒక్క వర్గానికి చెందకుండా స్వతంత్రంగా వ్యవహరించే ఈయనకు తమ అడుగులకు మడుగులొత్తే వారినే కోరుకునే మూడు వర్గాలలో ఒకరైనా మద్దతిస్తారా అనేది కాలమే చెప్పాలి. ఆలా జరిగితే ఈయనకు గల గుర్తింపుకు తోడు వర్గ బలం కూడా తోడై తీవ్రమైన పోటీ ఇస్తారని రెండు వర్గాలు అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
బలాలు: క్లీన్ ఇమేజ్, సీనియర్ గా గుర్తింపు, అన్ని వర్గాలతోనూ నాయకులతోనూ వ్యక్తిగత సత్సంబంధాలు, ఫౌండేషన్ చైర్మగా నిర్వహించిన “మన ఊరి కోసం” కార్యక్రమం మూలంగా అమెరికా వ్యాప్తంగా తెచ్చుకున్న కీర్తి, ప్రలోభాలకు ఒత్తిడికి లొంగని వ్యక్తిత్వం, రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ మూలంగా వచ్చే గుర్తింపు మరియు సింపతీ,’ తానా’ లో ప్రస్తుతం నెలకొన్న విద్వేష వాతావరణం.
బలహీనతలు: ఏ వర్గానికి పూర్తిగా చెందకపోవడం, సొంతంగా సభ్యులను చేర్పించుకోవడానికి వ్యతిరేకత, గ్రూప్/వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే శైలి, రెండు సార్లు పోటీ చేసి ఓటమి పొందడం.
సతీష్ వేమూరి: కాలిఫోర్నియా బే ఏరియా లో నివసించే సతీష్ వేమూరి ప్రస్తుత ‘తానా’ కార్యవర్గం లో కార్యదర్శి మాత్రమే కాకుండా ‘తానా’ లో గత కొంత కాలంగా జరుగుతున్న అనేక సంచలన విషయాలకు ముఖ్య కారకుడు గా చెప్పుకోవచ్చు. దశాబ్ద కాలం పాటు ‘తానా’ ని కంట్రోల్ చేసిన అధిష్ఠాన త్రయము ప్రాపకం తోనే ‘తానా’ పదవులు మొదలు పెట్టినప్పటికీ క్రమేణా వారి ఆధిపత్య ధోరణికి వ్యతిరేకి గా మారడమే కాకుండా గత ఎన్నికల్లో వారిని ఓడించడం లో కీలక పాత్ర వహించడంతో ప్రస్తుతం కొందరికి ఆప్తుడిగా మరికొందరికి శత్రువుగా ఉండడం ఒప్పుకోవాల్సి నిజం. ఈ గుర్తింపుకు తోడు అమెరికా వ్యాప్తంగా ఉన్న తమ ‘తానా’ వర్గం, స్నేహితులు, బంధువులు అండగా ఉండొచ్చు అనేది ఎంత నిజమో వ్యతిరేకులకు ఈయనను ఓడించడమే లక్ష్యం అనేదీ అంతే నిజం. ఇదే సమయంలో స్వప్రయోజనలకంటే ‘తానా’ భవిష్యత్తే ముఖ్యమని అందుకు అవసరమైతే ఎంత దాకా పోరాటానికైనా, అలాగే ఆమోద యోగ్యమైన త్యాగ్యానికై నా ఎల్లప్పుడూ సిద్ధమని, కానీ దాన్ని తన బలహీనతగా తీసుకోవద్దని బహిరంగంగా చెప్తూ ఉంటారు. 2019 ‘తానా’ కాన్ఫరెన్స్ లెక్కల అవకతవకలు, అక్రమ సభ్యత్వాలు వగైరా విషయాలపై చేస్తున్న పోరాటానికి ముఖ్య వ్యక్తిగానే కాక తాను నమ్మిన విషయాలపై ఇంట బయట లీగల్ తో సహా అన్ని రకాలుగా పోరాటం చేస్తుండడం ఈయన బలం అలాగే బలహీనత రెండూ. గతంలో కలసి పనిచేసిన అట్లాంటా లావు బ్రదర్స్ ప్రస్తుతం ప్లేటు ఫిరాయించడమే కాకుండా కార్యవర్గం లో కార్యదర్శి గా పనిచేసు కోవడంపైనా ఇబ్బందులు కలిగిస్తుండటం రాజకీయంగా నష్టమే. న్యాయానికి లీగల్ వ్యవస్థను వాడటానికి ఏమాత్రం వెనుకాడని ఈయనకు ఉన్న ఒక చిన్న పూర్వపు సమస్య వల్ల ప్రత్యర్థులు అదే లీగల్ వ్యవస్థను ఈయన మీద వాడుతాం అనడం ఎంతవరకు ప్రాక్టికల్ అనేది కూడా సమయమే చెప్పాలి.
బలాలు: ‘తానా’ లోని తమ వర్గం సపోర్ట్, విస్తృతమైన స్నేహితులు బంధువులు, పాత అధిష్టాన ప్రాబల్య ధోరణిలపై పోరాటం, కొత్త గా చేరిన సభ్యులకు ఓటుహక్కు ఇంకా రాక పోవటం, 2019 ‘తానా’ కాన్ఫరెన్స్ లెక్కలపై మడమ తిప్పని పోరాటం, ‘తానా’ భవిష్యత్తుకై త్యాగానికైనా సిద్ధపడటం.
బలహీనతలు: వ్యతిరేక వర్గానికి ముఖ్య లక్ష్యం గా మారడం, గతంలో కలిసి పనిచేసిన అట్లాంటా లావు బ్రదర్స్ దూరం కావడమే కాక అవతలి వర్గానికి కొమ్ముకాయడం, పూర్వపు లీగల్ సమస్య సృష్టించగలిగే తలనొప్పి, ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో(రీజినల్ మినహా) దేశవ్యాప్తంగా బాలట్ ఎన్నికల్లో పాల్గొనకపోవడం, నాయకులు, సన్నిహితులు మినహా మిగతా సామాన్య సభ్యులలో గుర్తింపు లోపం. న్యాయ వ్యవస్థ ద్వారా కొత్త సభ్యులకు ఓట్లు వచ్చే మరియు ఎన్నికలు వాయిదా పడే అవకాశం.
ప్రస్తుత ‘తానా’ పరిస్థితి
క్లుప్తంగా చెప్పాలంటే “ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత”, ఒక్క మాటలో “సందిగ్థత”, రెండు మాటల్లో “అంతటా సందిగ్థత”, మూడు మాటల్లో “కన్ఫ్యూషన్, కన్ఫ్యూషన్, కన్ఫ్యూషన్”.
అందరూ కలిసి పనిచేసి తెలుగు భాషకు, సంస్కృతికి మరియు ప్రజలకు సేవ చేయాలనే తపన తో పెద్దలు ఏర్పాటు చేసిన ‘తానా’ సంస్థకు ప్రస్తుత నాయకత్వం తమ అపరిపక్వ పరిపాలనతో పాటు సంస్థ ప్రయోజనాల కంటే వర్గ/వక్తిగత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్న కారణంగా అంతటా విద్వేష పూరిత వాతావరణం ఇంతకు ముందు ఏప్పుడూ లేనంతగా నెలకొన్నది. కలసి మెలసి పనిచేయాల్సిన ఎగ్జిక్యూటివ్, ఫౌండేషన్ మరియు బోర్డు కార్యవర్గాలు విడివిడిగా వ్యవహరిస్తూ, ‘తానా’ రాజ్యాంగానికి, సేవా స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. 6 మిల్లియన్ల పైగా ‘తానా’ కాన్ఫరెన్స్ కు విరాళాలు వచ్చాయి. ఎన్నడూ లేనంత గొప్పగా కార్యక్రమాలు చేసేస్తున్నాం వంటి అనేక సందేహపూరిత కబుర్లతో కాలక్షేపం చేస్తూ తమకు తామే గాక ‘తానా’ సభ్యులను కూడా భ్రమల్లో నెడుతున్నారు. వాస్తవానికి తమలో తాము చర్చించుకొని ‘తానా’ రాజ్యాంగాన్ని అనుసరించి పరిష్కరించుకోవాల్సిన అనేక సమస్యలను (‘తానా’ కాన్ఫరెన్స్ లెక్కలు, కొత్త సభ్యత్వాల సమస్య, మాచింగ్ గ్రాంటులు, ఎలక్షన్ ప్రాసెస్/టైమింగ్స్ వగైరా) స్వప్రయోజనాలకై రచ్చకు ఈడ్చి సమాధానాలను లాయర్లు కోర్టులను అడుగుతూ ఉండటం పతనానికి పరాకాష్ట గానే భావించాలి.
వచ్చే ఎన్నికల్లొనైనా సరైన నాయకత్వం ఏర్పడి ‘తానా’ ను మళ్ళీ గాడిలో పెడుతందనీ, ఎలక్ట్రానిక్ ఆన్లైన్ ఓటింగ్ వంటి అనేక సంస్కరణలతో సరికొత్త రూపు సంతరించుకొని గర్వంగా తలెత్తుకొంటుందనీ ఆశిద్దాం.
అదిగో…నవ లోకం…వెలసే…మన కోసం!
ఎచట హృదయాలు…ఎపుడూ విడిపోవో
అచట మనముందామా…ఆ..ఆ..ఆ..ఆ
అదిగో…నవ లోకం…వెలసే…మన కోసం
అదిగో…నవ లోకం…వెలసే…మన కోసం!!
TANA – మూడు ముక్కలాట లో ‘ఆల్ ఇన్’ గ్యాంబ్లింగ్ చేస్తున్న’తానా’ లోని మూడు వర్గాలు!