టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, విలక్షణ దర్శకుడు పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తో విజయ్ కెరీర్ లోనే వరస్ట్ సినిమాగా నిలిచింది. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో, ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి గల కారణాలపై పోస్ట్ మార్టం మొదలైంది.
పూరీ ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని, కథ, కథనం బాగోలేకపోవడం కూడా సినిమా డిజాస్టర్ కావడానికి మరో కారణమని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా లైగర్ సినిమాపై టాలీవుడ్ దర్శక నిర్మాత , విమర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగిరెగిరి పడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయంటూ విజయ్ దేవరకొండనుద్దేశించి తమ్మారెడ్డి పరోక్షంగా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి.
కేవలం సినిమా విషయంలోనే కాదని, ఏ విషయంలోనూ ఎవరూ ఎగిరెగిరి పడకూడదని తమ్మారెడ్డి హితవు పలికారు. ఇలా చేస్తే చివరకు ఎదురుదెబ్బలే మిగులుతాయని అన్నారు. తామంతా ఎంతో కష్టపడి సినిమా చేశామని, సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరుతూ ప్రమోషన్ చేసుకొని ఉంటే బాగుండేదని తమ్మారెడ్డి చెప్పారు. ఇలా కాకుండా చిటికెలు వేస్తూ మాట్లాడితే… ప్రేక్షకులు ఇచ్చే సమాధానం ఇలాగే ఉంటుందని విజయ్ దేవరకొండను విమర్శించారు.
‘లైగర్’ ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని తనకు అనిపించలేదని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తానని అన్నారు. తాను పూరీ జగన్నాథ్ అభిమానినని, ఆయన సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అన్నారు తమ్మరెడ్డి. అయినప్పటికీ, ట్రైలర్ తోనే ‘లైగర్’పై తనకు ఆసక్తి పోయిందని బాంబు పేల్చారు తమ్మారెడ్డి.