సినీ నటుడు, రచయిత, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి తాజాగా బిగ్ షాక్ తగిలింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పని చేసిన పోసాని.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత యాక్టివ్ అయ్యారు. మీడియా ఎదుట టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పదజాలంతో రెచ్చిపోయారు. నోటికి హద్దు అదుపు లేకుండా బూతులతో విరుచుకుపడ్డారు.
అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో పోసానికి కష్టకాలం మొదలైంది. రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించిన పోసాని చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పడంతో పాటు రాజకీయాలను వదిలేస్తున్నట్టు ప్రకటించారు. అయినా కూడా ఆయనను కర్మ వదల్లేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు పోసానిని లైట్ తీసుకున్నప్పటికీ.. టీడీపీ, జనసేన శ్రేణులు ఆయన్ను గట్టిగా టార్గెట్ చేశారు. వారి దెబ్బకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా పోసానిపై 15కు పైగా కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలోనే పోసాని అరెస్ట్ అవడం, రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడపడం తెలిసిందే. నానా తిప్పలు పడి గత నెలలో అన్ని కేసుల్లోనూ పోసాని షరతులతో కూడిన బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అయితే ఇంతలోనే నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో పోసాని పై మరో కేసు నమోదు అయింది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 15న విచారణకు హాజరుకావాలని పోలీసులు పోసానికి నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సైన్ చేసేందుకు వచ్చిన సమయంలో పోసానికి సూళ్లూరుపేట పోలీసులు ఈ నోటీసులు ఇచ్చారు. దీంతో పోసాని మళ్లీ జైలుకేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.