బాలు కోసం కోట్ల మంది కోరిన కోర్కెను ఆ దేవుడు మన్నించలేదు. ఆయన అవసరం మీకంటే నాకే ఎక్కువుంది అన్నట్టు మౌన సమాధానంతో బాలు ను మన నుంచి తీసుకెళ్లిపోయారు. ఇక నుంచి ఆయన పాటలు వింటూ బతకడం తప్ప మీకు మరో అవకాశం లేదని దేవుడు మనకు చాయిస్ లేకుండా చేశారు.
పరమదుర్గార్గులు పనికిమాలిన పోస్టు కోసం ఆయనను రాత్రి నుంచే చంపుతున్నారు గాని… 2020 సెప్టెంబరు 25 మధ్యాహ్నం 1.04 గంటలకు బాలు పరమపదించారు. ఈ లోకంలో తన భౌతిక చిరునామాను చెరిపేసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 74. ఆగస్టు 5న కరోనాతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చాలా క్రిటికల్ కండిషన్ కి వెళ్లి మళ్లీ చాలావరకు కోలుకున్నారు. అయితే… మళ్లీ కొద్దిరోజుల నుంచి జబ్బు తీవ్రమైంది. ఆయన అవయవాలు పని చేయడం మానేశాయి. లైఫ్ సపోర్ట్ మీదికి వెళ్లిపోయారు. నిన్న రాత్రి బాలును చూసి బయటికి వచ్చిన కమల్ హాసన్ ముఖకవళికలే ఈరోజు జరగబోయే ప్రమాదాన్ని చెప్పేశాయి. ఎట్టకేలకు ఆ దుర్వార్త వినకుండా మనం తప్పించుకోలేకపోయాం. బాలు ఇక లేరు.
అయితే… కఠినంగా , క్రూరంగా అనిపించినా.. ఆయన బతికితే ఆరోగ్యంగా బ్రతకాలి గాని నరకం లాంటి బతుకును ఆయన ఆస్పత్రి బెడ్ పై బతకడం మాత్రం ఎవరికీ ఇష్టం లేదు. ఈ నరకం కన్నా విముక్తి మంచిది.