సోనూ సూద్. ఇటీవల కాలంలో సేవా దురంధరుడిగా అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి పేరు సంపాయిం చుకున్న `పశుపతి` ఫేం సోనూ సూద్.. ప్రధాని నరేంద్ర మోడీని వెనుకేసుకు వచ్చారు.
నిజానికి ఇప్పుడు అందరూ ప్రధాని మోడీపై వ్యతిరేకతతో ఉన్న సమయంలో సోనూ ఆయనను వెనుకేసుకు రావడం సంచల నంగా మారింది. అదేసమయంలో తాను ప్రధాని పదవికి సరిపోనంటూ.. మరో సంచలన వ్యాఖ్య చేశారు సోనూ.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సోనూ సూద్ కామెంట్లకు సంబంధించిన పోస్టులు జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.
విషయం ఏంటంటే..
గతేడాది కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడ్డ ఎంతో మంది వలస కార్మికులకు పశుపతి సాయం చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు కరోనా రెండో దశలోనూ దేశంలో ఎవరైనా సాయం కోరితే.. వెంటనే స్పం దిస్తూ ఆపద్భాందవుడిలా ఆదుకుంటున్నాడు. దాంతో చాలామంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి హూమా ఖురేషి… సోనూసూద్ ప్రధానమంత్రి కావాలని తాను కోరుకుంటున్న ట్లు వెల్లడించింది. ఈ వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు కూడా మద్దతు తెలిపారు. సోనూ లాంటి ఉదార స్వభావం వున్న వ్యక్తి పీఎం అయితే.. దేశం బాగుపడుతుందని కామెంట్లు కూడా చేశారు.
పశుపతి రియాక్షన్ ఏంటంటే..
అయితే.. ఖురేషీ సహా నెటిజన్ల కామెంట్లపై సోనూసూద్ స్పందించారు. “ఆమె నా గురించి ఇలా చెప్పడం ఆమె మంచి మనసుకు నిదర్శనం. నేను ఈ గౌరవానికి అర్హుడిని అనుకుంటే, నేను తప్పక ఏదైనా మంచి పని చేశాననే చెప్పాలి. కానీ ఆమె చెప్పిన మాటలకు నేను ఏకీభవించను. ఇప్పుడు మనకు సమర్ధవంత మైన ప్రధాని ఉన్నారు. ఇంకా నాకు అంత వయసు కూడా రాలేదు. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి“ అని పేర్కొన్నారు.
రాజీవ్ లాగా కాలేను!
అంతేకాదు.. చిన్నవయసులోనే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఆయన విశిష్టమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అయితే నాకు అంత అనుభవం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని వారు అక్కడ చాలామంది ఉన్నారు. నా గురించి వారు కలత చెందాలని కోరుకోను. నేను నా పని చేయడం చాలా ముఖ్యం. నటుడిగా సంతృప్తిగా రాణిస్తున్నాను. ఇప్పుడు సామాన్యుల కష్టాలలో ఒకడిగా భాగం పంచుకుంటున్నాను. అధికారం, పదవి లేకుండా కూడా మనందరం కలిసి పనిచేయగలమని అనుకుంటున్నా.. అని సోనూ తన మనసు పరిచేశాడు.