టీటీడీ కొత్త చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై టిడిపి, జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్య మతస్థుడైన భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడంపై పలు హిందూ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. హిందువుల మనోభావాలను జగన్ ప్రభుత్వం మొదటి నుంచి దెబ్బతీస్తూనే ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, బిజెపి నేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భూమన తన డిక్లరేషన్లో క్రిస్టియన్ అని ఇచ్చినట్టుగా తనకు తెలిసిందని సోము సంచలన ఆరోపణ చేశారు.
జగన్ ప్రభుత్వం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని సోము డిమాండ్ చేశారు. క్రైస్తవ మతం మీద అభిమానం ఉన్న వ్యక్తులను టీటీడీ చైర్మన్ గా రెండోసారి నియమించడం హర్షించదగ్గ పరిణామం కాదని సోము అన్నారు. భూమన నియామకాన్ని, ఇటువంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. అంతకుముందు తనపై వస్తున్న విమర్శలపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఆ విమర్శలకు తాను భయపడే వాడిని కాదని భూమన క్లారిటీనిచ్చారు.
17 ఏళ్ల క్రితమే టీటీడీ చైర్మన్ గా పనిచేశానని, 30 వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు జరిపించానని భూమన అన్నారు. అన్నమయ్య 600వ వర్ధంతి, దళిత వాడలకు శ్రీ వెంకటేశ్వర స్వామిని తీసుకువెళ్లి కళ్యాణం చేయించిన ఘనత తనదేనన్నారు. తిరుమల నాలుగు మాడ వీధులలో చెప్పులు వేసుకుని తిరగకూడదన్న నియమాన్ని కూడా తానే తెచ్చానని చెప్పారు. తనపై క్రిస్టియన్ ముద్ర వేసే వారికి ఇదే తన సమాధానమని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను చూసి భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదని చెప్పారు.