కరోనా వైరస్ పుట్టుకకు చైనాలోని వుహూన్ ల్యాబరేటరీయే అని యావత్ ప్రపంచమంతా గోల చేసేస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానో లేకపో జనాల ఖర్మకొద్దో కరోనా వైరస్ వూహాన్ ల్యాబరేటరీ నుండి లీక్ అయ్యిందని యావత్ ప్రపంచదేశాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ కారణంగానే చైనాను ప్రపంచ విలన్ గా చూస్తున్నాయి చాలా దేశాలు.
ఇలాంటి నేపధ్యంలోనే హఠాత్తుగా కరోనా వైరస్ పై జరిగిన ప్రయోగాల్లో అమెరికా భాగస్వామ్యం కూడా ఉందనే విషయం సంచలనంగా మారింది. కొందరు శాస్త్రజ్ఞుల పరిశోధన పత్రాలను పరిశీలించిన తర్వాత తెలిసో తెలియకో కరోనా వైరస్ ప్రయోగాలకు చైనా, అమెరికా రెండు పురుడుపోశాయనే వాదనకు బలం పెరుగుతోంది.
గతంలో సార్స్, మోర్స్ వ్యాధులకు కరోనా వైరస్సే కారణమని తేలింది. భవిష్యత్తులో ఇలాంటి వైరస్ లు తలెత్తితే కంట్రోల్ చేయటానికి వీలుగా వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లో శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేస్తున్నారట.
ఈ ప్రయోగాలకు అవసరమైన నిధులు అమెరికా నుండి కూడా అందినట్లు కొందరు శాస్త్రజ్ఞులు తమ నివేదికల్లో చెప్పటం ఇపుడు సంచలనంగా మారింది. వూహాన్లో జరుగుతున్న ప్రయోగాల ఫలితాలను తమతో పంచుకునే ఒప్పందం మీదే అమెరికా నుండి చైనాకు భారీ ఎత్తున నిధులు అందినట్లు సమాచారం.
అయితే వూహాన్లో జరిగిన ప్రయోగాలకు అమెరికా నేరుగా నిధులు అందించలేదట. అమెరికా జాతీయ ఆరోగ్య పరిరక్షణ సంస్ధ(ఎన్ఐహెచ్)కు అనుబంధంగా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల నివారణ సంస్ధ (ఎన్ఏఐడీ)ద్వారా ఎకో హెల్త్ అలయెన్స్ అనే స్వచ్చంధ సంస్ధకు పెద్ద ఎత్తున నిధులు అందాయట. ఆ సంస్ధ నుండే వూహాన్ లోని వైరాలజీ ల్యాబ్ కు నిధులు అందినట్లు తాజగా బయటపడింది.
ఇపుడీ విషయాన్ని మాజీ అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారులు బయటపెట్టారట. దాంతో అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో గగ్గోలు మొదలైంది. అయితే అమెరికా-చైనాలు బద్ధ శతృవులు కదా ? మరి చైనా పరిశోధనలకు అమెరికా నిధులు ఎందుకు ఇస్తుందని అడిగేవారు కూడా ఉన్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే తనకు లాభం ఉందని అనుకుంటే అమెరికా ఏ దేశంతో అయినా చేయి కలుపుతుంది. దానికి కావాల్సింది ప్రపంచాధిపత్యం మాత్రమే. ఇందుకోసం అమెరికా ఏమైనా చేస్తుందనటానికి సందేహంలేదు.