ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దెబ్బకు హైదరాబాద్ లో ఫేమస్ థియేటర్లలో ఒకటైన సంధ్య థియేటర్ మూతపడనుందా? ఆ థియేటర్ లైసెన్స్ ను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయా? ఆ క్రమంలోనే ఆ థియేటర్ కు షోకాజ్ నోటీసులిచ్చారా? అంటే అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా ఈ రోజు పరామర్శించిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు.
శ్రీతేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ కావడంతో కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని ఆనంద్ చెప్పారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారని పోలీసులకు థియేటర్ నిర్వాహకులు చెప్పలేదని, ర్యాలీగా అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఎంటీ్ర, ఎగ్జిట్, సీటింగ్ ప్లాన్ లేదని, రెండు థియేటర్లకు కలిపి ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉన్నాయని చెప్పారు. అల్లు అర్జున్, ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని లోపలికి అనుమతించారని, కానీ, టిక్కెట్ల తనిఖీ సరిగా చేయకపోవడంతో అనధికారికంగా చాలామంది థియేటర్ లోపలికి వచ్చి రద్దీ పెరిగి తొక్కిసలాటకు దారి తీసిందన్నారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒకరు చనిపోయేందుకు కారణమైన థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శ్రీతేజ్ కు ట్రీట్మెంట్ కొనసాగుతోందని, పరిస్థితి విషమంగానే ఉందని, వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నామని కిమ్స్ హాస్పిటల్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.