టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో సమంత, కేటీఆర్, నాగార్జున, నాగ చైతన్యలను ఉద్దేశించి సురేఖ చేసిన వివాదాస్పద కామెంట్లు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలోనే సురేఖ వ్యాఖ్యలను కేటీఆర్, నాగార్జున, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ ఖండించారు. సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సమంత కూడా స్పందించింది.
విడాకులు అనేది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం అని, ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని సమంత క్లారిటీనిచ్చింది. అందులో ఎటువంటి రాజకీయ కుట్ర లేదని, దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని సమంత కోరింది. ఒక మహిళగా సమాజంలో ఒక వృత్తిలో మనుగడ సాగించడం, అందులోనూ చాలా సందర్భాల్లో మహిళలను వస్తువుల్లాగా చూసే సినీరంగంలో పని చేయడం అంత సులువు కాదని చెప్పింది. అంతేకాకుండా, ప్రేమలో పడడం, అందులో నుంచి బయటకు రావడం, మళ్లీ కెరీర్ లో నిలదొక్కుకోవడం సవాల్ వంటిదని అభిప్రాయపడింది.
ఇలా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పోరాడేందుకు చాలా శక్తి కావాలని, అటువంటి తన ప్రయాణాన్ని చులకన చేయొద్దని కోరింది. మంత్రిగా సురేఖ చేసే వ్యాఖ్యలకు చాలా విలువ ఉంటుందని, వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా ఉండాలని, వారి గోప్యతను గౌరవించాలని కోరింది. తాను ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉన్నానని, కాబట్టి రాజకీయాలలోకి తన పేరు లాగొద్దని సమంత కోరింది.