ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం మరింత ముదిరిన సంగతి తెలిసిందే. వరుసగా ఐదో రోజు కూడా రష్యా సేనలు ఉక్రెయిన్ పై దాడులు కొనసాగించాయి. రష్యా సేనలను దీటుగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలోనే కాల్పులు విరమించాలని ఇరుదేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చినా ఫలితం లేదు. అంతేకాదు, ఈ రోజు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. గంటల తరబడి సాగిన ఈ చర్చలు సింగిల్ తీర్మానం కూడా లేకుండానే ముగిశాయి.
మరోవైపు, చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై భారీ సాయుధ సంపత్తి ఉన్న బలమైన రష్యా దాడులు చేయడంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, క్రీడాకారులు కూడా రష్యా సైనిక చర్యను ఖండించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ యుద్ధంపై మరోసారి స్పందించింది. రష్యా వైఖరిని ఖండిస్తూ ఇస్టాగ్రామ్ వేదికగా సామ్ ఓ పోస్ట్ చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఓ యోధుడిగా అభివర్ణిస్తూ సామ్ చేసిన పోస్ట్ వైరల్ అయింది..
‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతడి తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అంటూ ఓ న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ని సామ్ షేర్ చేసింది. మరోవైపు, బాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్ కూడా ఈ యుద్ధంపై స్పందించింది. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు సాయం అందించాలని ప్రజలను అమీ అభ్యర్థించింది.