సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు రెండు నెలలు కావస్తోంది. సెప్టెంబరు 10న వినాయక చవితి రోజు హైదరాబాద్‌లో బైక్ మీద ప్రయాణిస్తూ అతను ప్రమాదానికి గురి కావడం.. దాదాపు నెల రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందడం తెలిసిందే.
కొన్ని రోజుల పాటు స్పృహలోనే లేడంటే అతడి గాయాల తీవ్రత ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా తేజు ఫొటోలేవీ బయటికి రాలేదు. కేవలం కోలుకుంటున్న దశలో థంప్సప్ సింబల్ చూపిస్తున్న చేతి ఫొటో మాత్రమే తేజు షేర్ చేశాడు.
ఆసుపత్రిలో, ఇంటికొచ్చాక తేజును చాలామంది కలిశారు కానీ.. ఎవ్వరూ ఫొటోలు దిగలేదు. ఎంతైనా తేజు సినిమా హీరో కావడంతో అతణ్ని పేషెంట్ లుక్‌లో బయటి ప్రపంచానికి చూపించడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఐతే ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నాడు. ఈ సందర్భంగా ఫొటో బయటికి వచ్చింది.
ఐతే ఈ ఫొటోలో తేజు ఒక్కడే లేడు. దాదాపు మెగా ఫ్యామిలీలోని మగవాళ్లందరూ ఉన్నారు. అల్లు అరవింద్, అల్లు శిరీష్ మాత్రమే ఈ ఫొటోలో లేరు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్, ఇంకా నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా నందన్ ఈ గెట్ టు గెదర్‌లో పాల్గొన్నారు.
తేజు టక్ చేసుకుని స్పెక్ట్స్ పెట్టుకుని డీసెంట్ లుక్‌లో కనిపించాడు ఈ ఫొటోలో. అతను కొంచెం సన్నబడ్డ విషయం తెలుస్తోంది. తేజు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో అతడితో కేక్ కూడా కట్ చేయించారు.
పవన్ కళ్యాణ్, అకీరా ఈ ఫొటోకు ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు. తేజు పూర్తి ఆరోగ్యవంతుడు కావడం పట్ల మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉందని, ఈ సందర్భాన్ని చాలా ప్రత్యేకంగా భావించి ఇలా గెట్ టు గెదర్ లాంటిది ఏర్పాటు చేసిందని అర్థమవుతోంది.
తేజు పట్ల మెగా ఫ్యామిలీకి ఉన్న ఆపేక్ష ఏంటో చెప్పడానికి ఈ ఫొటోనే రుజువని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. చిరు ఈ ఫొటోను షేర్ చేయగానే ఇది వైరల్ అయిపోయింది.